Share News

Bhatti Vikramarka: ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు బాధ్యత నాదే!

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:00 AM

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనదేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాను చీఫ్‌ విప్‌గా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్ఠానానికి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా అమలు చేయాలని కోరానని గుర్తు చేశారు.

Bhatti Vikramarka: ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు బాధ్యత నాదే!

  • వెనకడుగు వేసేదే లేదు.. అది సర్వరోగ నివారిణి

  • అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం

  • రూ.22,500 కోట్లతో 4.5 లక్షల మందికి ఇళ్లు

  • గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్‌ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో భట్టి

  • ఆదివాసీల కోసం కాంగ్రెస్‌ అనేక చట్టాలు చేసింది: మంత్రి కోమటిరెడ్డి

  • రాహల్‌ ప్రధాని అవుతారు: మంత్రి ఉత్తమ్‌

నాగార్జునసాగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనదేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తాను చీఫ్‌ విప్‌గా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్ఠానానికి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా అమలు చేయాలని కోరానని గుర్తు చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం ఆమోదం పొందిందన్నారు. ఈ నేపథ్యంలో, సబ్‌ప్లాన్‌పై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ట్రైకార్‌ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్యనాయక్‌ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ‘అఖిల భారత గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్‌ ప్రతినిధుల సాఽధికారత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం’ శనివారం జరిగింది. దీనికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ తనకు అవకాశం కల్పించిందని.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తూచా తప్పకుండా అమలు చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. సబ్‌ప్లాన్‌ చట్టాన్ని సర్వరోగ నివారిణిగా భట్టి అభివర్ణించారు.


అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరిచి.. సబ్‌ప్లాన్‌ ప్రకారం నిధులు కేటాయింపు జరుగుతుందా లేదా అనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే పలు శాఖల నుంచి నివేదికలు వచ్చాయని, త్వరలో వాటిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తానన్నారు. సబ్‌ ప్లాన్‌ కింద ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తుందని చెప్పారు. అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలుచేస్తామని.. దీంతో అటవీ సంపదలో గిరిజన, ఆదివాసీలకు అన్ని హక్కులు లభిస్తాయని భట్టి తెలిపారు. ఐటీడీఏలకు పునరుజ్జీవం కల్పిస్తామని, గిరిజన ఆదివాసీ నిరుద్యోగులకు శిక్షణను ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి మొదటి దశలో 4.5 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఒక లక్ష కలిపి రూ.6 లక్షలు ఇవ్వనున్నట్లు భట్టి తెలిపారు. ఆదివాసీల అబివృద్ధి కోసం అనేక చట్టాలను చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేసిందని, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్టాన్‌ సంపూర్ణంగా అమలవుతుందని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్‌ పాలనలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 04:00 AM