సినీ నటుడు వెంకటేశ్ కుటుంబసభ్యులపై కేసు
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:03 AM
దక్కన్ కిచెన్ కూల్చివేత వ్యవహారంలో హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబసభ్యులపై కేసు నమోదయింది. దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్‌లపై కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): దక్కన్ కిచెన్ కూల్చివేత వ్యవహారంలో హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబసభ్యులపై కేసు నమోదయింది. దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్‌లపై కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్, దగ్గుబాటి కుటుంబ సభ్యుల మధ్య ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్‌కు సంబంధించి గతంలో వివాదం నెలకొంది. ఈ విషయంలో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కాగా, 2022 నవంబరులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది హోటల్‌ను పాక్షికంగా కూల్చివేశారు.
ఈ అంశంలో యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే 2024 జనవరిలో హైకోర్టు ఆదేశాలున్నా దగ్గుబాటి కుటుంబం.. జీహెచ్‌ఎంసీ సిబ్బందిని తప్పుదోవ పట్టించి దౌర్జన్యంగా తన హోటల్‌ను కూల్చివేసిందని నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులను శనివారం ఆదేశించింది. దీంతో పోలీసులు కేసునమోదు చేశారు.