Share News

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:44 AM

వరంగల్‌ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Warangal: మామునూరు విమానాశ్రయానికి పచ్చ జెండా

  • వరంగల్‌ జిల్లాలో నిర్మాణానికి కేంద్రం ఓకే

  • ఏఏఐకి పౌరవిమానయాన శాఖ లేఖ

  • శంషాబాద్‌ నుంచి 150 కి.మీ. లోపు మరో విమానాశ్రయం ఉండరాదన్న నిబంధన ఉపసంహరణ

  • దీనిపై అప్పట్లోనే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

  • ఇప్పటికే భూసేకరణకు రూ.205 కోట్లు

  • రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న రెండో విమానాశ్రయం

  • సీఎం ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది

  • మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ

  • మోదీ సహకారం వల్లే వచ్చింది: కిషన్‌రెడ్డి

  • తెలంగాణకు ఇదో గేమ్‌ చేంజర్‌

  • కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/వరంగల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు.. జీఎంఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆ సంస్థ అంగీకారం తెలపడంతో మామునూరు విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌కుమార్‌ ఝా.. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌(హెచ్‌ఐఏఎల్‌)కు జత చేశారు. ఈ విషయాన్ని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం కూడా ధ్రువీకరించింది. వరంగల్‌లోని మామునూరులో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో అమిత్‌కుమార్‌ ఝాపేర్కొన్నారు. హెచ్‌ఏఐఎల్‌ తన బోర్డు ఆఫ్‌ డైరక్టర్స్‌ సమావేశంలో మామునూరు విమానాశ్రయానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన నుంచి తప్పుకొంటూ ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని కేంద్రం ఇప్పుడు ఆమోదించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన లేఖలను కూడా ప్రస్తావించారు. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కావాల్సిన 253 ఎకరాల అదనపు భూమిని ఏఏఐకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే రూ.205 కోట్లను విడుదల చేసిన విషయాన్నీ గుర్తు చేశారు.


నిరభ్యంతర పత్రం సమర్పణతో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ఆ సమయంలోనే కేంద్రం, హెచ్‌ఐఏఎల్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఈ ఒప్పందంలోని క్లాజ్‌ 5.2 ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో 25 ఏళ్లపాటు కొత్తగా దేశీయ లేదా అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతించరాదనే షరతు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఈ పరిధిలో తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణం జరగలేదని వెల్లడించింది. ఈ ఒప్పందంపై హెచ్‌ఐఏఎల్‌ ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని ఈ ఏడాది జనవరి 15న తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే హెచ్‌ఐఏఎల్‌, కేంద్రం మధ్య కుదిరిన ఒప్పందంలోని క్లాజ్‌ 5.2పై ప్రస్తుతం ఇచ్చిన నిరభ్యంతర పత్రం కేవలం మామునూరు విమానాశ్రయానికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. కాగా, మామునూరులో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంషాబాద్‌లోని విమానాశ్రయ సంస్థ (జీఎమ్మార్‌) నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు సిద్ధమైందని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ గతేడాది అక్టోబరు 25న ‘‘మామునూరుకు మోక్షం’’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది.


ఏ-320 విమానాలు తిరిగేలా..

మామునూరులో ఏ-320 (ఎయిర్‌బస్‌-320) లాంటి పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయం నిర్మించనున్నారు. ఇందుకు సంబంఽధించిన డిజెన్లు, వివిధ సాంకేతిక అంశాల విషయం ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఏ-320 స్థాయి విమానాలు అంటే.. ఒక్కో దానిలో ఒకేసారి 180 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వివిధ కంపెనీలకు సంబంధించి దేశ విదేశాల నుంచి వచ్చే సామగ్రి, ముడి పదార్థాలను తీసుకొచ్చే పెద్ద పెద్ద కార్గో విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద విమానా లు తిరిగేందుకు వీలుగా 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్‌వేను నిర్మించనున్నారు. ఇక మామునూరు ఎయిర్‌పోర్టును భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంగానూ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టుకు కేటాయించిన, భూ సేకరణ చేసి కేటాయించబోతున్న భూముల విస్తీర్ణం 949.44 ఎకరాలు. అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు నిబంధనల మేరకే భూమి కేటాయింపు జరిగిందని అధికారిక వర్గాలు అంటున్నాయి. కాగా 2023 జూలై, 2024 ఏప్రిల్‌లో ఏఏఐ నిర్వహించిన భూ పరీక్షలు, టెక్నో ఎకనామికల్‌ ఫీజబిలిటీ స్టడీ రిపోర్టును కేంద్రానికి సమర్పించింది. వివిధ పరీక్షల కోసం మూడు విమానాలతో ఎయిర్‌వ్యూను కూడా చేపట్టి, విమానాల రాకపోకలకు వాతావరణం ఏయే సమయాల్లో ఎలా ఉందనే అంశాన్ని కూడా పరిశీలించారు.


1930లోనే వరంగల్‌లో ఎయిర్‌పోర్టు..

మామునూరులో విమానాశ్రయం 1930లో నిజాం హయాంలోనే ఏర్పాటు కాగా.. వివిధ కారణాలతో 1980లో మూతపడింది. ఎయిర్‌పోర్టు కోసం నిజాం కాలంలోనే 1,875 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో నుంచే నవోదయ విద్యాలయానికి 23.20 ఎకరాలు, పోలీసు శిక్షణ కేంద్రానికి 59 ఎకరాలు, ఏసీపీ కార్యాలయానికి 10 ఎకరాలు, వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు 101 ఎకరాలు, ఫోర్త్‌ బెటాలియన్‌కు 241.24 ఎకరాలతోపాటు మరో 675 ఎకరాల భూమిని వెటర్నరీ వర్సిటీకి కేటాయించారు. ప్రస్తుతం ఏఏఐ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అదనంగా 253 ఎకరాల భూమి కావాలని ఏఏఐ ప్రభుత్వాన్ని కోరడంతో.. ప్రభుత్వం ఆ భూముల సేకరణకు నిధులు కూడా మంజూరు చేసింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడంతోపాటు పరిశ్రమల స్థాపనకు పెద్ద కంపెనీలు ముందుకువచ్చే అవకాశాలుంటాయి.


తెలంగాణకు ఇదో గేమ్‌ చేంజర్‌

తెలంగాణ రాష్ట్రానికి వరంగల్‌ విమానాశ్రయం గేమ్‌ చేంజర్‌గా, రాష్ట్రాభివృద్ధికి కీలక మైలురాయిగా మారుతుంది. ఇదో విమానాశ్రయం మాత్రమే కాదు.. తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంగా నిలుస్తుంది. వరంగల్‌ ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా మారడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మామునూరు విమానాశ్రయం పనులు వేగంగా ముందుకు సాగేందుకు కట్టుబడి ఉన్నాం.

- కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

సీఎం ప్రత్యేక చొరవతోనే..

సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పదేళ్లలో రాష్ట్రానికి ఒక్క ఎయిర్‌పోర్టు కూడా రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించింది. సహకరించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుకు కృతజ్ఞతలు.

- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

దశాబ్దాల కల నెరవేరింది

మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతినివ్వడంతో వరంగల్‌ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరినట్లయింది. విమానాశ్రయం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన అదనపు భూముల సేకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకారం అందించాలి. విమానాశ్రయం పూర్తయితే జిల్లా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది.

- మంత్రి కొండా సురేఖ

మోదీ సహకారంతోనే..

ప్రధాని మోదీ సహకారంతో వరంగల్‌ గడ్డపై విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రగతినే తెలంగాణ కోరుకుంటోంది. ప్రతీ తెలంగాణ గుండె.. మోదీకి ధన్యవాదాలు చెబుతోంది. తెలంగాణ ప్రజానీకం మోదీకి రుణపడి ఉంటుంది.

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Updated Date - Mar 01 , 2025 | 10:21 AM