Share News

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుపై అధ్యయనానికి ఫీజు చెల్లించండి

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:24 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టుపై అధ్యయనానికి ఫీజు చెల్లించండి

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు లేఖ

  • ఏఏఐకు 41 లక్షలు డిపాజిట్‌ చేయాలని వెల్లడి

  • ఫీజు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలంటూ కోమటిరెడ్డికి తుమ్మల లేఖ.. 2 రోజుల్లో నిర్ణయం!

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది. సర్కారు కేటాయించిన 950 ఎకరాల భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రీ-ఫీజబిలిటీ స్టడీ (ప్రాజెక్టుపై అధ్యయనం) నిర్వహించేందుకు రూ.41 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు గతంలో రాసిన లేఖలకు తాజాగా ఆయన బదులిచ్చారు.


కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు (జీఎ్‌ఫఏ) లను నిర్మించేందుకు పాలసీని తెచ్చిందని, అందులో భాగంగా కొత్తగూడెంలోనూ విమానాశ్రయ ఏర్పాటుకు సహకరిస్తామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటులో కీలకమైన సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని.. ఇందుకు (ఏఏఐ) తన బృందంతో అధ్యయనాన్ని చేపట్టేందుకు రూ.41 లక్షలు డిపాజిట్‌ చేయాలని లేఖలో సూచించారు. ఈ లేఖపై స్పందించిన మంత్రి తుమ్మల.. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలంలో అధ్యయనానికి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఫీజు చెల్లించే వ్యవహారంపై ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టు సమాచారం.

Updated Date - Jan 02 , 2025 | 03:24 AM