Film Industry: సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే!
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:52 AM
సినిమా రంగంలో భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తొలి రోజుల్లో టాలీవుడ్‌కు బెజవాడే కేంద్రంగా ఉండేది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
అమరావతి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సినిమా రంగంలో భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో బుధవారం పిచ్చాపాటిగా మాట్లాడారు. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగం ప్రస్తావన వచ్చింది. ‘మొదట్లో సినిమా రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేది. తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినా ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే సినిమా రంగానికి కీలకంగా ఉండేది. కాని కాల ప్రవాహంలో హైదరాబాద్ జనాభా కోటి దాటి పోయి అక్కడ సినిమా రంగానికి ఆదాయం పెరిగింది. దీంతో ఆ రంగంలో హైదరాబాద్ ప్రాముఖ్యం విస్తరించింది. కాని ఇప్పుడు పరిస్థితి ఇంకా మారింది.
తెలుగు సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తోంది. విదేశాలను దృష్టిలో పెట్టుకొని సినిమాల తయారీ, పంపిణీ జరుగుతోంది. అయినా ఆదాయపరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌దే ప్రముఖ స్థానం. భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు నిలిపివేసినా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సినీ రంగం నుంచి వచ్చిన విజ్ఞప్తులు కారణమా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. ‘మనం దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలు వేరే ఉన్నాయి. వాటిపై పనిచేయడం మాకు ప్రయారిటీ’ అని ఆయన వ్యాఖ్యానించారు.