CM Revanth Reddy: ఉప ఎన్నికలు రావు
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:11 AM
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో రానివి ఇప్పుడెలా వస్తాయి?.. అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడుంది
బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లపై కఠిన చర్యలు.. వాటి నిరోధానికి సిట్
వాటిని నిర్వహించినా, ప్రచారం చేసినా ఉపేక్షించం.. కేటీఆర్, హరీశ్‌ల దుష్ప్రచారం
పెట్టుబడులను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు.. వారి పోటీ తలనొప్పిగా మారింది
గచ్చిబౌలిలో ఓ వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం
ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం
ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు
వ్యవస్థ బలోపేతానికి సహకరించాలి: సీఎం
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్ నేతలు ఊదరగొడుతున్నారని, కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉందని, స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయని, ఏవీ మారలేదని గుర్తు చేశారు. అలాంటిది.. బీఆర్‌ఎస్ హయాంలో పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు. బుధవారం శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బెట్టింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. వీటి నిరోధానికి, నిషేధానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీలకు ప్రచారం చేసినా, నిర్వహించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆన్‌లైన్ గేమ్స్ నిషేధానికి చట్టం చేసినప్పటికీ.. అమల్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందన్నారు. గత చట్టంలో ఇటువంటి కేసులకు రెండేళ్ల వరకే జైలుశిక్ష ఉందని, దానిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ రమ్మీ, గేమ్స్‌కు ప్రచారం కల్పించిన వారిని విచారించామని తెలిపారు. అయితే కేవలం ప్రచారం కల్పించిన వారిని విచారించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అందుకే సిట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఆన్‌లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకమైన భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. నేరం జరిగిన తర్వాత సర్కారు స్పందించే తీరే చాలా ముఖ్యమన్నారు. ఎంఎంటీఎస్ రైలు అత్యాచార ఘటన తెలియగానే అప్రమత్తమయ్యామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని కొందరు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్‌ఆర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ఘటన, నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల హత్య, సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం, జూబ్లీహిల్స్ పబ్‌లో ఓ యువతిపై రేప్ లాంటి ఘటనలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. 2020లో అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. జూబ్లీహిల్స్ పబ్ రేప్ ఘటనలో ఓ బీఆర్‌ఎస్ నేత కొడుకు ఉన్నాడని, అలాగే ఓ మంత్రి కుమారుడి ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం నేరగాళ్లపై కఠినంగా, బాఽధితులపై సానుభూతితో ఉంటుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యసనాలకు తావు లేదని, జూదం, గంజాయి, కోడి పందేలు ఇక్కడ ఇప్పుడు నడవవని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మార్పునకు సంబంధించి గతంలోని విధానాలే ఇప్పుడూ ఉన్నాయని, అదే సంప్రదాయాన్ని తామూ అనుసరిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం విపక్ష నేతలను చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చిందని, తాము అలా చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు కల్పించుకుని, ‘కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తారా..’ అని అన్నారు. దీంతో.. కేసీఆర్ అడుగు జాడల్లో నడిస్తే తాము మడుగులో పడతామని సీఎం వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తున్నట్లు, తానే అభ్యర్థినంటూ ఒకాయన ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మంచి దుస్తులు వేసుకుంటే ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పానని, తాను చెప్పినట్లుగానే ఆయన మంత్రి పదవి పోయిందని అన్నారు. తమ దృష్టి ఉప ఎన్నికలపై లేదని, ఉపాధి, ఉద్యోగాలు, శాంతిభద్రతలు, అభివృద్ధిపైనే ఉందని చెప్పారు. బీఆర్‌ఎ్‌సపై తమకు ద్వేషం లేదని, కానీ.. క్షణికావేశంలో యాసిడ్ దాడులకు తెగబడినట్లుగా మాట్లాడితే నియంత్రిస్తామని అన్నారు.
పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం..
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ప్రచారం చేస్తూ.. పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీస్తే బీఆర్‌ఎ్‌సకు సంతోషమా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారేలా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని, అభివృద్ధిపై ఆ పార్టీ యాసిడ్ దాడి చేస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, అధికార కాంక్షతో ఎలాంటి అసత్య ప్రచారాలకైనా తెగబడతారని ఆరోపించారు. అధికారం లేకపోతే బతకలేమన్న ధోరణిలో ఆ పార్టీ ఉందన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డి రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇచ్చారని, ఆయన బాటలో బీఆర్‌ఎస్ నడవాలని సూచించారు. సాధారణ ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉన్నా.. ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు, తాము అధికారంలోకి రాబోతున్నామన్నట్లు బీఆర్‌ఎస్ కలలు కంటోందని సీఎం రేవంత్ విమర్శించారు. బీఆర్‌ఎ్‌సలో ఒకాయన ఉదయం ప్రెస్‌మీట్ పెడితే, మరొకరు సాయంత్రం ట్విటర్‌లో పోస్టు చేస్తాడని, వారిద్దరి (కేటీఆర్, హరీశ్‌రావు) మధ్య పోటీ తమకు తలనొప్పిగా మారిందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంగా తాను అందరు ఎమ్మెల్యేలకూ అందుబాటులో ఉంటానని, గజ్వేల్ ఎమ్మెల్యే వచ్చినా ఆయన సమస్యను పరిష్కారిస్తానంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తుత్తి, ఊదరగొట్టే బడ్జెట్ పెడితే రూ.4 లక్షల కోట్లు దాటేదని, కానీ.. తాము బీఆర్‌ఎస్ సర్కారులా కాకుండా వాస్తవికత ఆధారంగా బడ్జెట్ పెట్టామని అన్నారు.
గచ్చిబౌలి భూమి.. బిల్లీరావు నుంచి స్వాధీనం
గచ్చిబౌలిలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో బిల్లీరావు అనే వ్యక్తికి ఇచ్చారని, ఆ భూమిపై కేసు ఉంటే సుప్రీం కోర్టులో వాదించి తమ అధీనంలోకి తీసుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. దానిని అభివృద్ధి చేస్తామంటే బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నవారు ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. రూ.వేల కోట్ల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అర్ధరాత్రి అప్పనంగా ఎవరికీ కట్టబెట్టలేదని అన్నారు. అక్కడి భూములను అభివృద్ధి చేయాలనుకుంటే.. యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతున్నారని, కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆ భూమిలో గుంటనక్కలున్నాయని, వాటికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గచ్చిబౌలిలోని భూములకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధమని సీఎం ప్రశ్నించారు. ఎక్కడ భూసేకరణ చేయాలన్నా బీఆర్‌ఎస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. సీఎం అత్తగారి ఊరైన ఆమన్‌గల్‌కు రోడ్లు వేస్తున్నారంటూ హరీశ్‌రావు ఆరోపించారని, కానీ.. వారు 50 ఏళ్ల క్రితమే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు మధ్య 11 చోట్ల రేడియల్ రోడ్లు వేస్తున్నామని, అందులో భాగంగానే ఆమన్‌గల్ వరకు రేడియల్ రోడ్డు వస్తుందని అన్నారు. రోడ్లు, పరిశ్రమలు, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన వద్దా? అని నిలదీశారు. గత ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధిని కొనసాగించే చరిత్ర కాంగ్రె్‌సకు ఉందన్నారు.
బెట్టింగ్ యాప్స్ కేసులపై సీఎం ఆరా
తెలంగాణలో కలకలం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం చర్చించారు. బెట్టింగ్ యాప్స్ కేసుల స్వరూపం, అవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి? ఏయే దేశాల్లో బెట్టింగ్ యాప్స్ మూలాలున్నాయి? దేశం నుంచి ఆపరేట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వివరాలను పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు అయిన సినీ రంగానికి చెందిన అగ్రనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల వివరాలను తెలియచేశారు. పదుల సంఖ్యలో నిందితులు ఉన్న నేపధ్యంలో కేసు నిలబడాంటే.. నేరం చేసిన వాడిని పట్టుకోవాల్సి ఉంటుందని, ప్రమోట్ చేసిన వారిలో చాలామంది తెలియక చేశారని, వారిని అప్రూవర్లుగా మార్చుకోవడం వల్ల కేసు బలపడుతుందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతోపాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి ఎంతెంత డబ్బు అందింది? ఏయే విధంగా డబ్బు చేరింది? వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసిన కొందరు పెద్దలకు ఎంతెంత ప్రొటెక్షన్ ఫండ్ అందిందనే వివరాలను పోలీసు అధికారులు సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో కేసులు నమోదైన క్రమంలో వీటన్నింటిని ఒక దగ్గరకు చేర్చి దర్యాప్తు చేసే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, నిఘా విభాగం డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సీఐడీ డీజీ షికా గోయల్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరితో మాట్లాడాకే బెట్టింగ్ యాప్స్ కేసులపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News