Share News

28 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు

ABN , Publish Date - Jan 10 , 2025 | 03:35 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలనుకుంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారిందా? పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మంది నియోజకవర్గాలపై శీతకన్ను వేశారా?... ఈ ప్రశ్నలకు ఔననే బదులిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు.

28 మంది ఎమ్మెల్యేలపై పెదవి విరుపు

  • నియోజకవర్గాలపై శీతకన్ను.. ప్రజలు, కార్యకర్తలకు దొరకరు

  • వీరిలో ఎనిమిది మంది పూర్తిగా దూరం

  • ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే

  • రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజన

  • రెడ్‌ జోన్లో ముగ్గురు, ఆరెంజ్‌ జోన్లో ఇద్దరు మంత్రులు!

  • స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం

  • పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలనుకుంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారిందా? పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మంది నియోజకవర్గాలపై శీతకన్ను వేశారా?... ఈ ప్రశ్నలకు ఔననే బదులిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇకనైనా ఆ ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో ఒకింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1న తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ అందరి రిపోర్టు కార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎలా గడిచినా ఇక మీదట నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మమేకమై వారి సాధకబాధకాలు పట్టించుకోవాలనీ సూచించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి ఇటు ప్రజలు, అటు పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది.


ఏడాది పాలన, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం రేవంత్‌రెడ్డి స్వతంత్ర సంస్థతో ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ సర్వేలో విస్తుబోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తం 65 మంది ఎమ్మెల్యేల్లో 28 మంది వరకు నియోజకవర్గానికి సమయం కేటాయించట్లేదని సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో 8 మంది తమ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైనట్లు చెబుతున్నారు. సర్వే చేసిన సంస్థ.. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఎమ్మెల్యేలను గ్రీన్‌ జోన్‌లో ఉంచినట్లు చెబుతున్నారు. 37 మంది గ్రీన్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో ప్రజలు, కార్యకర్తలకు సమయం ఇవ్వని కారణంతో సగం మార్కులే పడిన ఎమ్మెల్యేలు 20 మంది వరకు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో ఇద్దరు మంత్రులూ ఉన్నారట.


కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలకు సమయం కేటాయించకుండా సొంత పనుల్లో మునిగిపోయిన ఎమ్మెల్యేలను రెడ్‌ జోన్‌లో ఉంచారని, ముగ్గరు మంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు ఈ జోన్‌లో ఉన్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆరెంజ్‌, రెడ్‌ జోన్లు కలుపుకుని ఏకంగా ఐదుగురు మంత్రుల పనితీరుపై వారి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు పెదవివిరవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది పాలనలో ప్రభుత్వం పట్ల గ్రామీణ ప్రజల్లో ఒకింత అసంతృప్తి ఉన్నా.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు, రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల సాయం ప్రకటనతో దాన్ని అధిగమించామని, స్థానిక సంస్థల ఎన్నికలను క్లీన్‌ స్వీప్‌ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సహా పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జడ్పీటీసీ సీట్లనూ దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే దాదాపు 40శాతం మంది ఎమ్మెల్యేల పనితీరుపై స్థానిక కార్యకర్తలు, ప్రజలు పెదవి విరుస్తుండడం.. స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఆందోళన నెలకొంది. కొత్త ఏడాది పార్టీ ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకుని ప్రజలు, కార్యకర్తలతో మమేకం కావాలని ఇప్పటికే సీఎం సూచించారు. ఆయా ఎమ్మెల్యేలతో సీఎం త్వరలో భేటీ కానున్నారని, సర్వే వివరాలు తెలిపి తగు సూచనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇలాగైతే గట్టి పోటీ తప్పదా?

లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటునూ దక్కించుకోలేక పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి.. తన మనుగడను చాటుకునేందుకు స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించడమే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు దక్కించుకున్న బీజేపీ.. ప్రత్యామ్నాయ రేసులో ముందుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఉనికిని చాటుకుంటే కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి ప్రత్యామ్నాయ రేసులో మిగిలే పరిస్థితి బీఆర్‌ఎ్‌సకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, రెడ్‌, ఎల్లో జోన్లలో ఉన్న ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోకుంటే పోటీ ఎదుర్కొనాల్సి రావచ్చని కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ స్థానిక నాయకులకు ఆర్థిక వనరులూ పుష్కలంగా ఉన్నాయని గుర్తుచేశారు. పదేళ్ల పాటు ప్రభుత్వంతో పోరాడి, కేసులను ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 03:35 AM