HMDA: వేగంగా చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:50 AM
గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ ప్రక్రియ ఇటీవల వేగవంతం అయింది. చెరువుల సంరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్‌పీసీ) ఏర్పాటై పదేళ్లు అవుతుంది.
హైకోర్టు విచారణతో ప్రభుత్వ విభాగాల్లో పెరిగిన స్పీడు
3503 చెరువుల సర్వే పూర్తి
గత రెండు నెలల్లో 300కుపైగా తుది నోటిఫికేషన్లు
హైదరాబాద్ సిటీ, జనవరి3 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ ప్రక్రియ ఇటీవల వేగవంతం అయింది. చెరువుల సంరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్‌పీసీ) ఏర్పాటై పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో చెరువుల హద్దులు నిర్ణయిస్తూ జారీ అయిన తుది నోటిఫికేషన్ల సంఖ్య 300 లోపే ఉంటుంది. అలాంటిది గత రెండు నెలల్లో 300కు పైగా తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటే.. చెరువుల సంరక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. హైడ్రా ఏర్పాటైన తర్వాత చెరువుల్లో ఆక్రమణల కూల్చివేతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో చెరువుల హద్దులకు సంబంధించిన తుది నోటిఫికేషన్ల జారీ అంశంపై ఆరు నెలల క్రితం సుమోటోగా ఓ పిటిషన్ రిజిస్టర్ చేసిన హైకోర్టు ప్రతి నెలా విచారణ జరుపుతోంది. దీంతో అప్రమత్తమైన హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ ఇతర ప్రభుత్వ విభాగాలు వేగం పెంచాయి. ఫలితంగా ఆరు నెలల క్రితం 300లోపు ఉన్న తుది నోటిఫికేషన్ జారీ అయిన చెరువుల సంఖ్య ప్రస్తుతం 765కు చేరింది. ఫిబ్రవరి 4న జరిగే తదుపరి విచారణ నాటికి ఈ సంఖ్యను వెయ్యి దాటించాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. తుది నోటిఫికేషన్ల జారీలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పురోగతి ఉండగా హైదరాబాద్ జిల్లాలో అడుగులు ముందుకు పడడం లేదు.
2891 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల సంరక్షణకు 2010లో అప్పటి ప్రభుత్వం ఎల్‌పీసీని ఏర్పాటు చేసింది. ఎల్‌పీసీ ఆదేశాల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 175, ఔటర్ పరిధిలో 326 కలిపి 501 చెరువుల్లో సర్వే చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిని టెండరు ప్రక్రియ ద్వారా 2013లో ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. అనంతరం ఫేజ్-2లో మరో 2,402 చెరువుల సర్వేకు ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 3532 చెరువుల్లో 3,503కు సంబంధించిన సర్వే పూర్తయినట్టు సమాచారం. అయితే, ఇందులో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ధ్రువీకరించిన 2,891 చెరువులకు హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా చెరువులకు ఐడీ నెంబర్లు ఇచ్చింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వీటిల్లో 765 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ఇలా
ఎల్‌పీసీ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఓ చెరువుకు అలుగు (మత్తడి) ఉంటే దాని ఎత్తును ఆధారంగా చేసుకొని.. చెరువుకు అన్నివైపులా అదే స్థాయి స్థలం ఉండేలా కొలతలు తీసుకుంటారు. అలుగు ఎత్తునే ఆ చెరువు ఎఫ్‌టీఎల్‌గా నిర్ధారిస్తున్నారు.
అలుగు లేని చెరువుల అంశంలో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ తూముల ఆధారంగా జరుగుతుంది. తూముకు 0.6మీటర్ల ఎత్తు నుంచి డీజీపీఎస్ అనే పరికరాన్ని వినియోగించి కొలతలు తీసుకుంటున్నారు.
అలుగు, తూము లేని చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ఆయా చెరువుల కట్ట ప్రామాణికం అవుతుంది. చెరువు నిండిన సమయంలో కట్ట(బండ్)కు ఆనుకుని నీరు బయటకు వెళుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎఫ్‌టీఎల్ నిర్ధారిస్తున్నారు.
అలుగు, తూము, కట్ట లేని చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణకూ మార్గదర్శకాలున్నాయి. చెరువు నిండిన తర్వాత నీళ్లు బయటకు పోయేందుకు ఆ చెరువుకు అనుకొని రోడ్డు మార్గం ఉన్న ప్రాంతాల్లోనే పైపులను అమర్చుతారు. ఆ పైపులకు కింది లెవల్‌ను ఆధారంగా చేసుకొని ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తున్నారు. సర్వే వివరాలను రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులతో పోల్చుతున్నారు.
చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారించే క్రమంలోనే బఫర్‌జోన్‌ను కూడా గుర్తిస్తున్నారు. 10హెక్టార్ల లోపు (24.75ఎకరాలు) ఉన్న చెరువులకు బఫర్ జోన్ 9మీటర్లుగా (30అడుగులు).. 10 హెక్టార్ల కంటే (24.75ఎకరాలు) మించి ఉండే చెరువులకు బఫర్ జోన్‌ను 30మీటర్లు (వంద అడుగులు) తీసుకుంటున్నారు.