Share News

Hyderabad: అమెరికన్లు, ఎన్నారైలే లక్ష్యంగా.. సైబర్‌ దోపిడీ

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:14 AM

అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ నిర్వాహకురాలు, 62 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: అమెరికన్లు, ఎన్నారైలే లక్ష్యంగా.. సైబర్‌ దోపిడీ

  • మాదాపూర్‌లో 62 మందితో కాల్‌సెంటర్‌.. పేపాల్‌ పేరిట ఫోన్లు

  • ఉద్యోగులుగా ఈశాన్య రాష్ట్రాల యువత

  • అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు

  • ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్‌కి మళ్లింపు

  • నిర్వాహకురాలు, ఉద్యోగుల అరెస్ట్‌

  • గుజరాత్‌కు చెందిన సూత్రధారి, మరో ఇద్దరు పరార్‌

  • అమెరికా వేళలతో నడిచే కాల్‌సెంటర్లపై నిఘా పెట్టండి.. పోలీసులకు డీజీ షికా గోయల్‌ సూచన

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ నిర్వాహకురాలు, 62 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ గురువారం విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్‌లో ఎక్సిటో సొల్యూషన్స్‌ పేరిట హైదరాబాద్‌కు చెందిన చందా మనస్విని ఓ కాల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఇందులో పనిచేయడానికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీయువకులను నియమించుకున్నారు. వీరంతా అమెరికన్‌ పౌరులు, ఎన్నారైలకు కాల్‌ చేసి.. తాము పేపాల్‌ సిబ్బంది అని నమ్మించేవారు. దుబాయ్‌కి చెందిన ఆజాద్‌, విక్కీ ద్వారా పేపాల్‌ ఖాతాదారుల వివరాలను సేకరించేవారు. టార్గెట్‌ చేసిన వినియోగదారులకు ముందు మెయిల్‌ చేసి ఒక కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ నంబరు ఇచ్చేవారు. ఖాతాదారులు ఆ నంబరుకు ఫోన్‌ చేయడంతో మనస్విని బృందం రంగంలోకి దిగేది. మీ పేపాల్‌ ఖాతాలో 500-1000 డాలర్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పేవారు. పేపాల్‌ నుంచి అదనంగా పొందిన డబ్బు తిరిగి ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించేవారు. ఇలా అమెరికన్‌ పౌరుల నుంచి కాజేసిన సొమ్మును వివిధ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా మళ్లించి దుబాయ్‌కి పంపిచేవారు. ఈ దందాకు సూత్రధారి గుజరాత్‌కు చెందిన కైవన్‌ పటేల్‌ అలియాస్‌ జాదు భాయ్‌, దుబాయ్‌లో ఉండే అతని సోదరుడు విక్కీ, వీరి మరో భాగస్వామి ఆజాద్‌ అని షికా గోయల్‌ తెలిపారు. ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారన్నారు. వీరితో కలిసి మనస్విని ఈ కాల్‌ సెంటర్‌ను నడుపుతున్నారని చెప్పారు. ఉద్యోగుల్లో 22 మంది మహిళలు, 41 మంది పురుషులు ఉన్నారని.. మనస్విని సహా వీరందరికీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.


తెలిసే నేరం చేశారు..

ఈశాన్య రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వచ్చి కాల్‌ సెంటర్‌ నిర్వాహకుల వలలో చిక్కిన యువతను అరెస్టు చేయడం సరైన నిర్ణయమేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. వారంతా నేరం చేస్తున్నామని తెలిసే కాల్‌ సెంటర్‌లో పనిచేశారని, అందుకే అరెస్టు చేశామని గోయల్‌ చెప్పారు. తెలంగాణలో సైబర్‌ నేరాలను పూర్తిగా అరికట్టడం కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాదాపూర్‌ కాల్‌ సెంటర్‌లో పనిచేసిన వాళ్లంతా అమెరికా కాలమానం ప్రకారం షిఫ్టుల్లో పనిచేశారన్నారు. ఇలాంటి షిఫ్టుల్లో నడుస్తున్న కాల్‌ సెంటర్లలో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించాలని.. వారేం పని చేస్తున్నారో నిఘా పెట్టాలని గోయల్‌ సూచించారు.

Updated Date - Mar 07 , 2025 | 04:14 AM