Share News

DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:52 AM

రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లో రాణించాలి

  • ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో మహిళలు రాణించడం అంత సులువు కాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని మహిళలు రాజకీయ రంగంలో రాణించాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో భాగంగా శనివారం జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో డీకే అరుణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు తాను ఎంతో శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. కుటుంబాన్ని, నియోజకవర్గ ప్రజలను, పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకోవడం మహిళలకు చాలా కష్టమన్నారు. రాజకీయాల్లో అడుగడుగునా అవమానాలు సర్వసాధారణమని, వాటన్నింటితో పోరాడి మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలుగా విడిపోయినా భాషాపరంగా కలిసున్న తెలుగువారిని ఐక్యం చేసేందుకు ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు.


ఇక, భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ.. మద్రాసులో పుట్టి, పెరిగినా వృత్తిరీత్యా అమెరికాలో కొన్నేళ్లు ఉన్నా.. తెలుగు భాష, సాహిత్యం, సంగీతాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1996లో భారత్‌ బయోటెక్‌ను స్థాపించిన తాము దేశం వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా చేశామని చెప్పుకునేందుకు గర్విస్తున్నానని తెలిపారు. బయోటెక్నాలజీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అమ్మాయిలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, విశాక ఇండస్ట్రీస్‌ ఎండీ సరోజ వివేకానంద, పుల్లారెడ్డి విద్యాసంస్థల నిర్వాహకురాలు విద్యారెడ్డి, ఎలికో హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఎండీ వనిత దాట్ల, టోయర్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ యర్రంశెట్టి పద్మజ, ప్లాటో గ్రీన్‌ టెక్‌ సీటీవో రైటా మోచర్ల (ఫిన్లాండ్‌కు చెందిన యువతి) తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలు మరింతగా రాణించడానికి అనుకూలమైన విధానాలు, వెసులుబాట్లు కల్పించాలని వారంతా అభిలాషించారు. ఈ కార్యక్రమంలో తేజస్విని యార్లగడ్డ, కవితా దత్‌ తదితరులు అతిథులను శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. చర్చా కార్యక్రమం అనంతరం ప్రముఖ గాయకుడు రామ్‌ మిరియాల నిర్వహించిన సంగీత విభావరి సభికులను ఆకట్టుకుంది.

Updated Date - Jan 05 , 2025 | 04:52 AM