ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:16 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ అత్యంత క్లిష్టమైనది. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్. మధ్యలో ఎక్కడా కూడా యాడిట్ (బయటకు వెళ్లే ద్వారం లేదు). దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు చూశాం.

దేశంలో ఇతర టన్నెల్ ప్రమాదాలకు ఇది భిన్నం
టన్నెలింగ్‌కు టీఎస్పీ విధానం అనుసరించాల్సిందే
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీఆర్‌వో మాజీ ఏడీజీ పురుషోత్తం, ఆర్మీ టన్నెలింగ్ నిపుణుడు మెహ్రా
(ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
‘శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ అత్యంత క్లిష్టమైనది. దేశంలో అత్యంత పొడవైన టన్నెల్. మధ్యలో ఎక్కడా కూడా యాడిట్ (బయటకు వెళ్లే ద్వారం లేదు). దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు చూశాం. కానీ వాటికి, ఎస్‌ఎల్‌బీసీకి సారూప్యం లేద’ని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ వో) మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ పురుషోత్తం, చండీగఢ్ వెస్ట్రన్ కమాండ్ టన్నెలింగ్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా అన్నారు. వాస్తవానికి టన్నెలింగ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించలేమని పేర్కొన్న వారు మున్ముందు ఎస్‌ఎల్‌బీసీ విషయంలో టన్నెల్‌సెస్మిక్ ప్రిడిక్షన్ (టీఎ్‌సపీ) విధానాన్ని అనుసరించాలని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యలు చేపట్టడానికి వెళుతున్న వారిని ‘ఆంధ్రజ్యోతి’ ఉమ్మడిగా ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు...
సహాయక చర్యల పూర్తికి ఎంత సమయం పట్టొచ్చు?
పురుషోత్తం, మెహ్రా: కచ్చితంగా చెప్పలేం. ఉత్తర కాశీ సిల్కియారాలో టన్నెల్ కూలిన ప్రాంతానికి, టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్)కు మధ్య చాలా ఎడం ఉంది. దాంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారిని చాలా రోజుల తర్వాతైనా సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అలా కాదు. పైకప్పు కూలిన ప్రాంతానికి, టీబీఎం మధ్య గ్యాప్ లేదు. మట్టి, బురద, రాళ్లు అందులో పనిచేసేవారి మీద, టీబీఎం మీద పడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం 13 కిలోమీటర్ల మేర దూరం ఉంది. దాంతో సరైన పరీక్షలు చేసి, మట్టి ఎక్కడ ఉంది వంటి అంశాలను గమనించిన తర్వాత సహాయక చర్యలు ఎన్ని రోజుల పాటు జరుగుతాయో తేలనుంది. వారం రోజుల్లోపు పూర్తి చేయడానికి అవకాశం ఉంది.
టన్నెల్‌లో ప్రమాదాలను నివారించవచ్చా?
పురుషోత్తం, మెహ్రా: టన్నెల్‌లో ప్రమాదాలను ఉహించలేం. దేశంలోనే కాదు ప్రపంచంలోనూ టన్నెల్‌లో ప్రమాదాలు సాధారణం. భూమి పరిస్థితిని అంచనా వేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్‌ఎల్‌బీసీలో ఇన్‌లెట్ వైపు బురదతో పాటు సీపేజీ చాలా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్‌లో 20 సార్లు ప్రమాదం జరిగినా ప్రాణనష్టం జరుగలేదు. బార్పతి టన్నెల్‌లో టీబీఎం ఇరుక్కుపోయింది. ఉత్తర కాశీ సిల్కియారా టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ప్రదేశానికి, టీబీఎంకు మధ్య 200 మీటర్ల గ్యాప్, గాలి, వెలుతురు, ఆహారం ఉండటం వల్ల చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటికి తేగలిగాం. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే నిర్ణీత వ్యవధిలో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఇప్పటికైనా టన్నెల్ లోపల నిరంతర పరిశీలనకు వీలుగా జీపు లేదా చిన్నవ్యాన్ వచ్చి వెళ్లేలా యాడిట్ ఏర్పాటు చేసుకోవాలి.
ఇంత పెద్ద టన్నెల్ ప్రపంచంలో ఉందా?
పురుషోత్తం, మెహ్రా: రైల్వే టన్నెల్ ఉన్నప్పటికీ నీటిని తరలించే టన్నెల్‌లో ఇప్పటిదాకా ఇదే పెద్దది. అత్యంత క్లిష్టమైన టన్నెల్ కూడా. ఎస్‌ఎల్‌బీసీలో డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక ముందు టన్నెలింగ్ చేసుకోవాలంటే విధిగా జియోఫిజికల్ పరీక్షలు చేసుకుని, టీఎ్‌సపీ విధానంతో ముందుకెళ్లాలి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ జాతీయ సంపద. సహాయక చర్యల అనంతరం ఈ పథకాన్ని పూర్తి చేసుకోవాలి.