Pending Bills: పెండింగ్ బిల్లులు చెల్లించాలి..
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:22 AM
చలో సెక్రటేరియట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచుల సంఘం నాయకులు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సచివాలయం వద్దకు చేరుకున్నారు.

సెక్రటేరియట్ వద్ద మాజీ సర్పంచుల నిరసన
అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ వద్ద నిరసన చేపట్టేందుకు మాజీ సర్పంచులు యత్నించగా పోలీసులు భగ్నం చేశారు. చలో సెక్రటేరియట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచుల సంఘం నాయకులు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన తెలిపేందుకు మాజీ సర్పంచులు, సర్పంచుల సంఘం నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వీరిలో సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వియాదయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాకనాగయ్య తదితరులున్నారు.
సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని 13 నెలలుగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. తక్షణం తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు. కాగా.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా.. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపిన మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.