SLBC Tunnel: కార్మికుల ఆచూకీ కోసం క్యాండీవర్ శునకాలు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:04 AM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు సర్కారు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందు కోసం కేరళ నుంచి ప్రత్యేక శునకాలను రప్పించింది.

13 రోజులు గడిచినా.. 8 మంది జాడ తెలియలే
సొరంగంలో కన్వేయర్ బెల్టు ట్రయల్ రన్
నాగర్‌కర్నూల్/దోమలపెంట/అమ్రాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు సర్కారు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందు కోసం కేరళ నుంచి ప్రత్యేక శునకాలను రప్పించింది. మరోవైపు కన్వేయర్ బెల్టు ట్రయల్ రన్ కూడా కొనసాగుతోంది. 13 రోజులు గడిచినా గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎ్‌ఫల సిబ్బంది జీపీఆర్ ద్వారా సెన్సార్లను భూమి లోపలికి పంపించి కార్మికుల ఆనవాళ్ల కోసం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే బురద నీటితో కూడిన ప్రాంతంలో జీపీఆర్ వ్యవస్థ వారి ఆచూకీని పసిగట్టలేకపోయింది. ఐదు ప్రదేశాల్లో మెత్తని భాగాలు ఉన్నట్లు జీపీఆర్ గుర్తించిన ప్రదేశాల్లో మట్టిని తొలగించడంతో పాటు టన్నెల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను తరలించే పని చేపట్టారు.
ఈ క్రమంలో అధికారులు గురువారం కేరళ నుంచి క్యాండీవర్ శునకాలను రప్పించారు. ఎయిర్‌ఫోర్సు హెలికాప్టర్లలో తీసుకొచ్చిన రెండు శునకాలను టన్నెల్ లోపలికి తీసుకెళ్లారు. భూమికి ఐదడుగుల లోపల మానవ, జంతు సంబంధ అవశేషాలు ఉంటే ఈ శునకాలు పసిగడతాయి. మరోవైపు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణకు ఇంజనీరింగ్ నిపుణులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. కన్వేయర్ బెల్టు పని చేస్తే మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఉంటుంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సెక్రటరీ కర్నల్ కీర్తి ప్రతా్‌పసింగ్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.