Share News

Harish Rao: టికెట్‌ రేట్ల పెంపు ఎవరి కోసం..!

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:04 AM

ఇకపై సినిమాలకు ప్రత్యేక ప్రివిలేజ్‌ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎవరి కోసం టికెట్‌ రేట్లను పెంచారని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish Rao: టికెట్‌ రేట్ల పెంపు ఎవరి కోసం..!

  • మీ మాటలను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది:హరీశ్‌

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఇకపై సినిమాలకు ప్రత్యేక ప్రివిలేజ్‌ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎవరి కోసం టికెట్‌ రేట్లను పెంచారని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రెండు వారాలు కూడా కాకముందే సీఎం మాట మార్చారని, ఆయన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. మాటతప్పం, మడమ తిప్పమంటూ బీరాలుపలికి ఇప్పుడు టికెట్‌రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.


సీఎం అసెంబ్లీలో ప్రకటించినదానికే విలువ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్‌ రేట్లు, అదనపు షోలకు అనుమతివ్వడం సభను అవమానించడం కదా అని నిలదీశారు. సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలు కూడా స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలయ్యాయని దుయ్యబట్టారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతామని పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 05:04 AM