Harish Rao: రేవంత్ పాలనలో మహిళలకు వేదనే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:09 AM
మహిళలను కోటీశ్వరులను చేస్తామని కోతలు కోసిన రేవంత్ రెడ్డి పాలనలో వారికి మిగిలింది వేదనే అని, కనీసం లక్షాధికారులుగా కూడా చేయని చేతగాని సర్కారు ఇదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
కోటీశ్వరులను చేస్తామని చెప్పి లక్షాధికారులనూ చేయలేదు: హరీశ్
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలను కోటీశ్వరులను చేస్తామని కోతలు కోసిన రేవంత్ రెడ్డి పాలనలో వారికి మిగిలింది వేదనే అని, కనీసం లక్షాధికారులుగా కూడా చేయని చేతగాని సర్కారు ఇదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏడాదిన్నర పాలన లో మహిళలకు ఏం చేశారని వేడుకలు నిర్వహిస్తున్నారంటూ సీఎంను శనివారం ఓ ప్రకటనలో నిలదీశారు. ‘ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు.
సుమారు రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాల బకాయిలే ఇప్పటిదాకా చెల్లించని కాంగ్రెస్ సర్కారు.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఎలా ఇస్తుంది. మహిళలకు నెలకు రూ.2,500 ఇప్పటికీ ఇవ్వట్లేదు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకివ్వడం లేదు. ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు, తులం బంగారం ఏమైంది? ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలకు రేవంత్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.