Share News

మార్గదర్శిపై కేసు కొనసాగాల్సిందే: ఆర్బీఐ

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:12 AM

మార్గదర్శి కేసుపై శుక్రవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లపై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కె. సుజన ధర్మాసనం విచారణ జరిపింది.

మార్గదర్శిపై కేసు కొనసాగాల్సిందే: ఆర్బీఐ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి కేసుపై శుక్రవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లపై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కె. సుజన ధర్మాసనం విచారణ జరిపింది. రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టంలోని 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించినందుకు మార్గదర్శి కేసు ఎదుర్కోవాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచందర్‌ వాదిస్తూ.. మార్గదర్శి హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎ్‌ఫ) కర్త రామోజీరావు మరణించినప్పటికీ కేసు విచారణ కొనసాగాలని తెలిపారు. ఒకవేళ తప్పుచేసినట్లు తేలితే మార్గదర్శి సంస్థ సెక్షన్‌ 58 (బీ) ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదిస్తూ.. హెచ్‌యూఎ్‌ఫకు కర్త, కర్మ, క్రియ అన్నీ రామోజీరావే కాబట్టి ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇక ఎవరిపైనా కేసు ఉండదని తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కేసు విచారణ చేపట్టడం వల్ల సమయం వృథా తప్ప ఏమీ ఉండదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పూర్తిస్థాయి వాదనల కోసం మార్చి 7కు కేసును వాయిదా వేసింది.

Updated Date - Mar 01 , 2025 | 05:12 AM