Karimnagar: కౌశిక్‌రెడ్డి అరెస్ట్!
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:11 AM
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
హుజూరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్‌లో అదుపులోకి
కలెక్టరేట్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాడికి
యత్నించారంటూ కరీంనగర్‌లో కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదులు
4 కేసులు.. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు పోలీసులు
ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు
కౌశిక్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌కు ఫిర్యాదు చేశా: సంజయ్
కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం: హరీశ్‌రావు
అర్ధరాత్రి కరీంనగర్‌లో హైడ్రామా.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్/కరీంనగర్ క్రైం/జగిత్యాల అర్బన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించేందుకు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకొని, దాడికి యత్నించారని సంజయ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, ఆర్డీవో కె.మహేశ్వర్, సుడా చైర్మన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. రాత్రి 10.40 గంటలకు కరీంనగర్ తీసుకొచ్చారు. ఆయన్ను కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారు. ప్రాథమిక విచారణ అనంతరం వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పెద్దఎత్తున నిరసనకు దిగిన బీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాంగ్మూలం ఇచ్చిన సంజయ్
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సాయంత్రం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఎమ్మెల్యే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం ఆయన స్టేషన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తనపై దాడికి యత్నించి, దుర్భాషలాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కౌశిక్‌రెడ్డి తనను దుర్భాషలాడారని, దాడి చేసేందుకూ యత్నించారని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ వివాదంపై నివేదిక తెప్పించుకొని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పినట్లు సంజయ్ వివరించారు. తనను కౌశిక్‌రెడ్డి నెట్టివేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పారు. తానెప్పుడూ ఏ వ్యక్తినీ దూషించలేదన్నారు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులు ఉన్నాయని తెలిపారు.
కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలావాటేనని, వరంగల్‌లో బెదిరించి సెటిల్‌మెంట్ చేశాడని ఆరోపించారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడాలని అనుకుంటే ఆయన ఆటంకం కలిగించాడన్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే తనను గెలిపించారని, అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు. కౌశిక్‌రెడ్డి దురుసు ప్రవర్తనపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తే ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. తనను ప్రశ్నించే ముందు కౌశిక్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. గతంలో బీఆర్‌ఎస్ చేరికలపై కేసీఆర్ క్షమాపణ చేబితే, తాను రాజీనామా చేస్తానని చెప్పారు. కాగా, జగిత్యాలలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చిత్రపటాన్ని గాడిదకు తగిలించి ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు నిరసన తెలిపారు. అనంతరం కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: హరీశ్
కౌశిక్‌రెడ్డిని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 13 నెలల పాలనలో తెలంగాణ కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమన్నారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇపుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అణచివేతలు, నిర్బంధాలకు బీఆర్‌ఎస్ పార్టీ భయపడదని హరీశ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి.. కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ విసిరారు.