Hyderabad: జడివాన!
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:15 AM
అకాల వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసి ఉరుములు, మెరుపులతో జడి వాన కురిసింది.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
బండ్లగూడ కంచన్‌బాగ్‌లో 8 సెం.మీ.. లోతట్టు ప్రాంతాలు జలమయం
స్తంభించిన ట్రాఫిక్‌తో వాహనదారులకు ఇబ్బందులు
ఈదురు గాలులకు కూలిన చెట్లు.. విద్యుత్తు సరఫరాకు అంతరాయం
జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం
పలు జిల్లాల్లోనూ గాలివాన.. దెబ్బతిన్న పంటలు.. నేడు, రేపు వర్షాలే
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): అకాల వర్షానికి హైదరాబాద్ మహా నగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్నా.. సాయంత్రానికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసి ఉరుములు, మెరుపులతో జడి వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపించాయి. చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలి కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల కార్లు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. బండ్లగూడ కంచన్‌బాగ్‌లో అత్యధికంగా 8 సెం.మీ. వర్షం కురిసింది. అస్మాన్‌గడ్ డివిజన్‌లో విద్యుత్తు తీగలపై చెట్టు విరిగిపడటంతో 60కి పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్‌కు వచ్చే ప్రధాన రహదారి మార్గంలో రామకృష్ణ థియేటర్ ఎదురుగా నిర్మిస్తున్న నూతన భవనంపై నుంచి భారీ క్రేన్ కూలి కిందపడింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లంగర్‌హౌజ్, బేగంపేట, ఉప్పుగూడ, రామంతాపూర్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంట్ సరఫరా, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లో రోడ్డుపై ఓ భారీ వృక్షం ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో పేలిపోయింది. చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కోఠి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు నెలకొన్నాయి. బడంగ్‌పేట, మలక్‌పేట, హబ్సీగూడ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు సిబ్బంది మరమ్మతులు చే పట్టి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా డీఆర్‌ఎఫ్ బృందాలు, విరిగిపడ్డ చెట్లను తొలగించేందుకు హైడ్రా బృందాలు చర్యలు చేపట్టాయి. భారీ వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, విద్యుత్తు అధికారుల సమన్వయంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కూలిన, విరిగిన చెట్లను తొలగించడంతో పాటు రోడ్లపై నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పలు జిల్లాల్లోనూ వర్ష బీభత్సం..
పలు జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం కొనసాగింది. వరి, మామిడి, మొక్కజొన్నతో పాటు పసుపు, నవ్వులు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొన్ని చోట్ల పిడుగులు పడి మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి సమీప ప్రాంతాల్లో బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వికారాబాద్‌లో ఈదురు గాలులకు భారీ వృక్షం విరిగిపడగా ట్రాక్టర్‌పై వెళ్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఈదురు గాలులకు పశువుల దొడ్లు నేలకూలాయి. తాండూరు, మొయినాబాద్ మండలాల్లో భారీ వర్షానికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులకు మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు పడి 12 మంది రైతులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. గాలి వానకు నిర్మల్ జిల్లా మామడ ఎంపీడీవో కార్యాలయం ముందు గల భారీ వృక్షం నేలకూలింది.
మామడలో కోతకు వచ్చిన నువ్వులు, పసుపు పంట పూర్తిగా తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలోని ఇస్రోజివాడిలో పిడుగుపాటుతో కడారి దేవయ్యకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, భీమారం, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కథలాపూర్ మండలాల్లో వరి, నువ్వుల పంటలు నేలవాలాయి. జగిత్యాల జిల్లాలో 200 ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల నువ్వులు, సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నేల వాలి పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం, ముస్తాబాద్ ప్రాంతాల్లో వడగళ్ల వానతో కొంత పంట నష్టం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో గాలివానకు పలు గ్రామాల్లో రేకుల ఇళ్లు, పౌలీ్ట్ర ఫాంల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కావేరమ్మపేట సమీపంలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. మిడ్జిల్ మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. సంగారెడ్డి జిల్లాలో కోహీర్, కంగ్టి, ఝరాసంగం మండలాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిలిల్లింది. మెదక్ జిల్లా చేగుంట, మాసాయిపేట మండలాల్ల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. వడగండ్ల వానలకు మామిడికాయలు నేలరాలాయి.
రెండు రోజులు వానలు
రాష్ట్రంలో రెండు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా శనివారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 42.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 42.1, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 41.7 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News