MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:53 PM
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
హైదరాబాద్: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ సంఘాల మహాసభలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇవాళ (శుక్రవారం) మహాత్మా జ్యోతిబాపూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జన్మదినమని, దేశంలోని ఆడబిడ్డలందరికీ నేడు పండగ దినమని కవిత చెప్పారు. సావిత్రబాయి పూలే పులి బిడ్డ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. "సావిత్రిబాయిపూలే ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తు నిర్మాణం చేస్తారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీలకు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది కులం లేదని, కులరహిత సమాజం నిర్మిస్తామని గొప్పగొప్ప మాటలు చెప్తారు. కానీ, భారతదేశంలో కులాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కులాల ఆధారంగానే జీవిస్తున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం రాసిన పెద్దలు కొన్ని హక్కులు కల్పించారు. రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు దేశ ప్రజలందరూ చేతిలెత్తి మెుక్కాలి. ఆయన హక్కులు కల్పించకపోతే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికీ ఎటువంటి ఫలాలు దక్కేవి కాదు. అలాగే బీసీలోని అన్ని కులాలకు రాజ్యాంగంలో రక్షణ కల్పిస్తే బాగుండేంది.
1953లో అప్పటి ప్రధాని నెహ్రూ బీసీలపై అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ వేశారు. పాపం ఆ పెద్దమనిషి రెండేళ్లు శ్రమించి రిపోర్టు ఇస్తే నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఇది చరిత్ర, కాదనలేని వాస్తవం. ఇందిరమ్మ రాజ్యమని ఇవాళ గొప్పలు చెప్తు్న్నారు. ఆమె హయాంలోనూ మండల్ కమిషన్ రిపోర్టును పదేళ్లపాటు బీరువాలో పెట్టారు. మండల్ కమిషన్ రిపోర్టును వీపీ సింగ్ అమలు చేస్తే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛినం అవుతుందని ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పలేదా?. బీసీల కోసం పోరాడే మమ్మల్ని మీకు ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని" ఆమె మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..
TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..