KTR: కేటీఆర్ సంచలన పోస్ట్.. సీఎం రేవంతే టార్గెట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:08 AM
KTR: ఈడీ విచారణకు ముందు ఫార్ములా కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా-ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా తాను భావిస్తానని వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 16: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఈరోజు(గురువారం) ఈడీ (ED) విచారణను ఎదుర్కోనున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో (Formula E Car Race Case) కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. నేటి ఉదయం 10:30 గంటలకు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు కేటీఆర్. అయితే ఈడీ విచారణకు ముందు ఫార్ములా కేసుపై మాజీ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు.
ఫార్ములా-ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందని గుర్తుచేశారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని తెలిపారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా తాను భావిస్తానని వెల్లడించారు. ఫార్ములా - ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలని.. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందన్నారు. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని, ప్రతీనయా పైసాకు లెక్క ఉందని స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు, కేసులు, విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతోందని మండిపడ్డారు. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయన్నారు. అప్పటిదాకా న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..
Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు
Read Latest Telangana News And Telugu News