Share News

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్

ABN , Publish Date - Jan 08 , 2025 | 07:59 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తారు. తర్వాత తనను ఏసీబీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన  డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్
KTR

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)కు వస్తారు. ఈ సందర్బంగా పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆయన ఆవిష్కరించనున్నారు. తర్వాత హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) వేయనున్నారు. న్యాయవాదుల సమక్షంలోనే తనను ఏసీబీ అధికారులు (ACB Officers) విచారణ జరిపేలా అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటని కేటీఆర్ అన్నారు. కాగా గురువారం విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులిచ్చారు. అయితే విచారణకు సహకరిస్తానన్నారు. తనపై ఉన్న కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.


16న విచారణకు రండి: ఈడీ

ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన ప్రకారం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు కేటీఆర్‌ను ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని బుధవారం ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమయం కోరిన బీఎల్‌ఎన్‌ రెడ్డి, నేటి విచారణకు తప్పనిసరిగా హజరు కావాల్సిందేనని, ఆయన మరోసారి సమయం కోరితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్‌ పోలీసులు..

ఫార్ములా-ఈ కారు రేసు దర్యాప్తులో విచారణలు, అరెస్టులు ప్రారంభం కానున్న క్రమంలో బంజారాహిల్స్‌ సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. కేటీఆర్‌ తదితరుల విచారణ సమయంలో బందోబస్తుపై, ఒకవేళ అరెస్టులు జరిగితే అవసరమైన ఎస్కార్టు గురించి ఏసీబీ నుంచి పోలీసులకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ కమిషనర్‌తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం.


ఏసీబీ ముందుకు అర్విందకుమార్‌..

మరోవైపు ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి కీలక వ్యవహారాలు చక్కదిద్దిన నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్విందకుమార్‌ను బుధవారం ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్‌ను విచారించడానికి ముందే అర్విందకుమార్‌ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్‌ఈవో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, పురపాలక శాఖకు మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండగా.. రెండోసారి స్పాన్సరర్‌ను తప్పించి పురపాలక శాఖ, ఎఫ్‌ఈవో ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది? తొలి ఒప్పందంలో భాగంగా రెండో సెషన్‌కు స్పాన్సరర్‌ కంపెనీ ఫీజు చెల్లించాల్సి ఉండగా ఎవరి ఆదేశాలతో హెచ్‌ఎండీఏ నుంచి రూ.46 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించారు.. అనే విషయాలపై అర్విందకుమార్‌ నుంచి వివరాలు సేకరించనున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన క్రమంలో విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో తెర ముందు, వెనక జరిగిన విషయాలు బయటపెడితే మాత్రం కేటీఆర్‌ అరెస్టు మరింత సులభం అవుతుంది. అర్విందకుమార్‌ అప్రూవర్‌గా మారితే ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చు. '


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ పర్యటనకు పీఎం మోదీ..

అరెస్టుకు వేళాయెనా..?

బ్యాంకులదే పూర్తి బాధ్యత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 08 , 2025 | 07:59 AM