TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:23 PM
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు వెళ్లేందుకు 3,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక బస్సులు ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకూ అందుబాటులో ఉంటాయని భక్తులకు తీపి కబురు చెప్పింది. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతోపాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‍ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను 50 శాతం వరకూ పెంచినట్లు ఆయన వెల్లడించారు. అయితే సాధారణ సర్వీసుల టికెట్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదని సజ్జనార్ పేర్కొన్నారు. మరోవైపు ఏడుపాయలకు వెళ్లే ప్రత్యేక బస్సులకు సవరించిన ఛార్జీలు ఫిబ్రవరి 26- 28 మధ్య వర్తిస్తాయని ఆయన తెలిపారు. గత శివరాత్రి కంటే ఈసారి ఆర్టీసీ యాజమాన్యం 809 అదనపు ప్రత్యేక బస్సులను నడుపుతోందని చెప్పుకొచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక సేవలను ఉపయోగించి దేవాలయాలకు సురక్షితంగా వెళ్లి దర్శనం చేసుకోవాలని సజ్జనార్ ఆకాంక్షించారు.
అయితే మహాశివరాత్రి ప్రత్యేక బస్సులలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం అమలులో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బస్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల గురించి మరిన్ని వివరాల కోసం టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News