Share News

Hussain sagar Fire Accident: హుస్సేన్‌సాగర్‌ ప్రమాదం ఘటన.. చికిత్స పొందుతూ ఒకరు మృతి

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:54 AM

Hussain Sagar: హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. రెండు రోజులుగా రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

Hussain sagar Fire Accident: హుస్సేన్‌సాగర్‌ ప్రమాదం ఘటన.. చికిత్స పొందుతూ ఒకరు మృతి
Hussain Sagar Fire Accident

హైదరాబాద్, జనవరి 28: హుస్సేన్‌సాగర్ అగ్రిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం భారతమాతకు హారతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరుగగా బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గణపతి ఈరోజు (మంగళవారం) మృతిచెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే బోటు ప్రమాదం సమయంలో గల్లంతైన యువకుడు అజయ్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. రెండో రోజు హుస్సేన్‌సాగర్‌లో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న భారత మాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో హుస్సే్న్‌సాగర్‌లో రెండు బోట్లు ఉంచి బోట్లలో నుంచి టపాసులు పేల్చాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే టపాసులు పేలుస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. టపాసులు దిశ మార్చుకుని నిల్వ ఉంచిన టపాసులపై పడటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో అవి పేలాయి. దీంతో రెండు బోట్లు దగ్ధమయ్యాయి. అదే సమయంలో బోట్లో ఉన్న వారంతా తమ ప్రాణాలను రక్షించుకోడానికి కిందకు దూకారు. అయితే టపాసులు పెద్ద ఎత్తున పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో బోట్లలోనే ఉన్న గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గణపతి క్రాకర్స్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. క్రాకర్స్‌ పేలుస్తున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో గణపతికి 80 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి.

HYDRA: హైడ్రాకు ఫిర్యాదులు.. మాజీ ఎమ్మెల్యే ఫెన్సింగ్ నేలమట్టం.. ఎక్కడంటే


వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గణపతి మరణించాడు. ఇదే ప్రమాదంలో బోటు ఆపరేట్ చేస్తున్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ బోటులో అజయ్‌ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ప్రాణాలను దక్కించుకునేందకు అజయ్‌తో పాటు ఇద్దరు స్నేహితులు హుస్సేన్ సాగర్‌లో దూకారు. అయితే ఇద్దరు స్నేహితులు క్షేమంగా బయటకు రాగా.. అజయ్ మాత్రం గల్లంతయ్యాడు. రెండు రోజులుగా అజయ్‌ కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. అజయ్ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే వరకు కూడా అతడు అదృశ్యమైనట్లు ఎవరూ గుర్తించలేదు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అజయ్‌ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించారు. తిరిగి ఈరోజు తెల్లవారుజాము నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాణాలను కాపాడుకునే సమయంలో నీళ్లలో దూకిన వీరంతా లైఫ్ జాకెట్లు ధరించలేదని తెలుస్తోంది. అజయ్‌ ఆచూకి కనుగోనాలంటూ తల్లిదండ్రులు హుస్సేన్‌‌సాగర్‌ ఒడ్డునే కూర్చుని రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది.


ఇవి కూడా చదవండి...

రోడ్డు దాటుతున్న వ్యక్తిని.. చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు ..

నన్ను కావాలనే హనీట్రాప్ కేసులో ఇరికించారు: ప్రొ. దుర్గప్ప

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 12:27 PM