Delhi: మోదీ పక్కనే చిరంజీవి.. సంక్రాంతి సంబరాల్లో సందడి..
ABN , Publish Date - Jan 13 , 2025 | 06:25 PM
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులతో గ్రామాలు, పట్టణాలు ముస్తాబు కాగా.. కోడి పందేలు, ఎడ్ల పందేలతో పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులతో గ్రామాలు, పట్టణాలు ముస్తాబు కాగా.. కోడి పందేలు, ఎడ్ల పందేలతో పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇంట్లో సంక్రాంతి సంబరాలు హోరెత్తిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఆయన నివాసంలో ఇవాళ(సోమవారం) సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఎంపీలు లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి , డి.కె.అరుణ సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలు సైతం వేడుకలో పాల్గొన్నారు. అలాగే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతి రాధిత్య సింధియా, మనోహర్ లాల్ కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీశ్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు.
మరోవైపు పలువురు ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. కేంద్ర మంత్రి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి, చిరంజీవి, పెమ్మసాని చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంటిని ముస్తాబు చేశారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.