Share News

Delhi: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడికి బెయిల్..

ABN , Publish Date - Jan 27 , 2025 | 12:09 PM

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అరెస్టు చేయగా దాదాపు 10 నెలలుగా జైలులోనే తిరుపతన్న ఉన్నారు.

Delhi: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడికి బెయిల్..
Phone Tapping Case

ఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న(ASP Thirupathanna)కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్న 10 నెలలుగా జైలులోనే ఉన్నారు. మెుదట బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును తిరుపతన్న పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.


కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, తిరుపతన్న తరఫున సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ఇంకా ఎంత సమయం పడుతుందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం లూథ్రాను ప్రశ్నించగా.. నాలుగు నెలలంటూ ఆయన తెలిపారు. ఈ మేరకు ఇంకెంత కాలమంటూ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అయితే నిందితుడు 10 నెలలుగా జైలులోనే ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. పిటిషినర్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయెుద్దంటూ తిరుపతన్నను ఆదేశించింది.


ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. 03, డిసెంబర్ 2023న తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాడే ఆధారాలు సైతం ధ్వంసం చేశారని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్ననే ప్రధాన నిందితుడు అంటూ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, దాదాపు పది మాసాలుగా జైల్లో ఉన్న ఏఎస్పీ.. సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: కొత్త అవతారమెత్తిన సాఫ్ట్‌వేర్లు.. వీరు చేసిన పనికి పోలీసులు ఏం చేశారంటే..

Hospital Fake Reports: వెలుగు చూస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల మోసాలు.. ఫేక్ రిపోర్టులతో

Updated Date - Jan 27 , 2025 | 12:36 PM