Share News

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:44 PM

Supreme Court Comments: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు సంబంధించి అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court Key Comments

న్యూఢిల్లీ, మార్చి 25: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‌పై (Telangana MLAs disqualification Pitition) విచారణను సుప్రీం కోర్టు (Supreme Court) ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో ముగ్గురు, ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయం అని చెప్పలేదని.. అలాంటప్పుడు వాటిని కాదని తామెలా వెళ్లగలమని సుప్రీం ప్రశ్నించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా రాయగలం అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.


పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరవున సీనియర్ న్యాయవాది అరియామా వాదనలు వినిపిస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేపై వేరు వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని.. నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని దానం నాగేందర్ గురించి ధర్మాసం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారని తెలిపారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో... నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీసు ఇచ్చారన్నారు. ఇప్పటికి మూడు వారాలు అయ్యిందని.. ఆ మూడు వారాలు, నోటీసులు ఎటువెళ్లాయో తెలీదని కౌశిక్ రెడ్డి న్యాయవాది తెలిపారు. తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తి అయిందని.. ఇప్పటికీ స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నవ్వుతూ చెప్పారు.


స్పీకర్ క్వాషి జ్యూడిషియరీ అధికారాలతో ఉన్నారని.. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉందని న్యాయవాది సుందరం తెలిపారు. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. అలాంటి సందర్భంలో.. రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. స్పీకర్ క్వాషీ జ్యూడిషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా స్పీకర్ వ్యవహరించాలన్నారు. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన వీధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదని... కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే తాము కోరుతున్నామన్న న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.


ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో ముగ్గురు, ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలు కూడా స్పీకర్‌ను తగిన సమయం అని స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు తాము వాటిని కాదని ఎలా ముందుకు వెళ్లగలమని.. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి రాయలేం కదా అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది.


న్యాయవాది సుందరం మాట్లాడుతూ... తగిన సమయం అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయన్నారు. కానీ, మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాజేంద్ర సింగ్‌ రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుందని... కేవలం నాలుగు వారాల్లోనే నిర్ణయం కూడా జరిగి పోయిందని తెలిపారు. రాజేంద్ర సింగ్‌ రాణా కేసులో మూడు నెలలు కాదని.. నాలుగు వారాలే అని స్పష్టం చేయడంతో.. అనర్హత వేటు పడిందని ఆర్యామ సుందరం వెల్లడించారు. మరో కేసులో... తగిన సమయం అంటే నిర్ణయం స్పీకర్‌ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందనిని చెప్పిందని చెబుతూ.. పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది అరియామా సుందరం వాదనలను ముగించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.


బీఆర్‌ఎస్ తరపు న్యాయవాదులు సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపు వాదనలు ముగియగా.. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2న స్పీకర్,అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Funny Haircut Video: ఇలాక్కూడా కటింగ్ చేస్తారని ఇప్పుడే తెలిసింది.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 01:26 PM