Share News

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..

ABN , Publish Date - Feb 06 , 2025 | 07:25 AM

సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోబోతోంది.

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..
CM Revanth Reddy..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం సాయంత్రం ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో (Mallikarjuna Kharge) ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ (Deepadas Munshi) , టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Mahesh Goud) తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.


సీఎల్పీ సమావేశం

కాగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు అంశాలపై సీఏం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న పార్టీ.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై చర్చ జరపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ రెండు అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టిపెట్టింది. వీటిపై చర్చించేందుకు గురువారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ సమావేశం జరగనుంది.


ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీ దిశానిర్దేశనం చేయనున్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై సమీక్ష చేసి తగు సూచనలూ ఇవ్వనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలనూ తీసుకునేందుకు.. సీఎల్పీ భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఉమ్మడి జిల్లాలవారీ సమావేశాలకు కూడా సీఎం ప్రణాళిక వేసుకున్నారు. కానీ, గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ ప్రణాళిక వాయిదా పడింది. రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి.. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్‌ అక్తర్‌ నివేదికను ఆమోదించిన నేపథ్యంలో వీటిపై అధిష్ఠానానికి వివరాలు వెల్లడించేందుకు ఢిల్లీకి వెళ్లాలని సీఎం ముందే భావించారు.

అయితే, బుధవారం ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగడం.. శనివారం ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గురువారం రావాల్సిందిగా ఆయనకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలిసింది. ఈమేరకు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ కూడా ఆయనతో ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరు శుక్రవారం కూడా అక్కడే ఉండి.. రాహుల్‌గాంధీని, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలవనున్నట్టు సమాచారం. కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివరాలతోపాటు.. రాష్ట్ర కాంగ్రె్‌సలో జరుగుతున్న ఇతర పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణ భారతం

కిక్కు లెక్క తేల్చేస్తారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 06 , 2025 | 07:25 AM