Minister Seethakka: వేసవి దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 06:33 PM
Minister Seethakka: వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వరుసగా పండుగలు వస్తున్నాయని.. ప్రజలంతా ఊర్లలోనే ఉంటారు..మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రావద్దని సూచించారు.

హైదరాబాద్: వేసవి దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వేసవికాలంలో నీటి సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఎర్ర మంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈలతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా తాగు నీటి సరఫరాపై సమీక్షలో మంత్రి సీతక్క చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు నివేదించాలని అన్నారు. వారంలో నాలుగు రోజులు మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలని చెప్పారు. మండలాన్ని యూనిటీగా తీసుకుని ఎంపీడీవో, ఇంట్రా ఏఈ, గ్రిడ్ ఏఈ, మండల స్పెషల్ ఆఫీసర్‌లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ కమిటీలు సమన్వయంతో పని చేసి ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. వరుసగా పండుగలు వస్తున్నాయని.. ప్రజలంతా ఊర్లలోనే ఉంటారు..మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునే విధంగా ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ పనుల వల్ల ఎక్కడెక్కడ మిషన్ భగీరథ పైపులు దెబ్బతింటున్నాయో చూడాలని వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. దీనివల్ల అక్కడక్కడ తాత్కాలికంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో, వర్క్ ఇన్స్‌స్పెక్టర్లతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనుల సందర్భంగా మిషన్ భగీరథ పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలని సూచించారు. నీటి సరఫరాలో ఏదైనా సమస్యలు తలెత్తితే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
స్థానికంగా నీటి వనరులు అందుబాటులో ఉన్నచోట బోర్ వెల్స్‌ను హైర్ చేసుకోవాలని సూచించారు. గత పదేళ్లలో వేల సంఖ్యలో బోర్లను పట్టించుకోలేదని అన్నారు. తాము వాటన్నిటిని మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచామని చెప్పారు. మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు గాని గ్రామాలను ప్రత్యేకంగా పరిగణించాలని అన్నారు. కొందరు తమ వీధుల్లో బోర్లు వేయించుకునేందుకు తాగునీటి సమస్యలు ఉన్నట్లుగా చెబుతున్నారన్నారు. తాగునీటి సరఫరాకు అవసరమైనంత నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. కొత్త బోర్ల వైపు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలతో కలిసి మిషన్ భగీరథ అధికారులు సమావేశం కావాలని అన్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా నీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Read Latest Telangana News and Telugu news