‘కాళేశ్వరం’పై కేసు పెట్టినందుకే.. రాజలింగమూర్తిని హత్య చేశారు
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:51 AM
‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టినందుకే.. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ విషయాన్ని హతుడి భార్యాబిడ్డలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు’’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హతుడి భార్యాబిడ్డలు ఇదే చెప్పారు
ఫిర్యాదుదారు చనిపోయినా.. విచారణ కొనసాగించవచ్చు: ప్రభుత్వం
భూపాలపల్లి కోర్టు ఆదేశాలు కొట్టేయాలటూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్.. హైకోర్టులో తీర్పు రిజర్వు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టినందుకే.. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ విషయాన్ని హతుడి భార్యాబిడ్డలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు’’ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. భారత నేర శిక్షా స్మృతి(సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 200 ప్రకారం రాజలింగమూర్తి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారని.. ఆయన చనిపోయినప్పటికీ విచారణను కొనసాగించవచ్చని.. సాక్షులను విచారించి, నిజానిజాలు నిర్ధారించుకుని, ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చే అధికారం ట్రయల్ కోర్టుకు ఉంటుందని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు గురైందంటూ రాజలింగమూర్తి ఫిర్యాదు మేరకు.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతరులను ఆదేశిస్తూ.. నోటీసులిచ్చిన విషయం తెలిసిందే..! జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కేసీఆర్, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలను వినిపిస్తూ.. ఫిర్యాదుదారు చనిపోయినప్పటికీ కేసు కొనసాగించవచ్చని పేర్కొన్నారు.
తొలుత ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసిందని.. సదరు ఉత్తర్వులపై భూపాలపల్లి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. మెజిస్ట్రేట్ కోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చినందున.. జిల్లా కోర్టులో రివిజన్ వేయడం చట్టసమ్మతమేనని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కోర్టు నిర్ణయంలో ఎలాంటి లోపం లేదన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జిల్లా కోర్టు రివిజన్ పిటిషన్‌ను స్వీకరించడమే తప్పన్నారు. ఫిర్యాదుదారు లేనప్పుడు కేసును ఎవరు నిరూపిస్తారని ప్రశ్నించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. రాజలింగమూర్తి వారసులు ఈ కేసును కొనసాగించడానికి సిద్ధంగా ఉంటే వారి వాదన వినడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. ఫిర్యాదుదారు వారసుల నుంచి ఏమైనా సూచనలు అందాయా? అని రాజలింగమూర్తి న్యాయవాదిని ప్రశ్నించింది. దానికి న్యాయవాది స్పందిస్తూ.. ఎలాంటి సూచనలు అందలేదని చెప్పారు. అలాంటప్పుడు కేవలం పత్రికల్లో వచ్చిన విషయాలను ఎలా ఆధారాలుగా చూపిస్తారని పీపీని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.