పుణ్య స్నానాలకు ఎల్లంపల్లి నీరు
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:14 AM
గోదావరినదిలో నీరు లేక మహా శివరాత్రి పుణ్య స్నానాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చొరవతో ప్రభుత్వం ఎల్లంపల్లి నీటిని దిగువ గోదావరిలోకి వదిలింది. గోదావరినదిలో నీరు లేని పరిస్థితిపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.

కోల్‌సిటీ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): గోదావరినదిలో నీరు లేక మహా శివరాత్రి పుణ్య స్నానాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చొరవతో ప్రభుత్వం ఎల్లంపల్లి నీటిని దిగువ గోదావరిలోకి వదిలింది. గోదావరినదిలో నీరు లేని పరిస్థితిపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళ వారం రాత్రి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సుమారు 600క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటి అవసరాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మిషన్ భగీరథ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ తదితర పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున వరకు నీరు రామగుండం, గోదావరిఖని, జనగామ తీరాలకు చేరింది. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సమ్మక్క - సారలమ్మ జాతర పుష్కర ఘాట్ నుంచి లోనికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు పుష్కర ఘాట్ వద్ద శివునికి పూజలు నిర్వహించారు. సమ్మక్క- సారలమ్మ జాతర కమిటీ, రామగుండం నగరపాలక సంస్థ భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసింది. జనగామ శివారులోని పుష్కరఘాట్ లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఎల్లంపల్లి నీటిని వదలడంతో శుభ్రమైన నీటి ప్రవాహం గోదావరిలో ఉన్నట్టు భక్తులు పేర్కొన్నారు. సుమారు లక్ష మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు పేర్కొంటున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, కమాన్‌పూర్, మంచిర్యాల జిల్లా జైపూర్, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు.
భక్తుల సౌలభ్యం కోసం నీటిని విడుదల చేయించాం
మహాశివరాత్రి సందర్భంగా గోదావరినది పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయించినట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. బుధవారం గోదావరి తీరంలోని పుష్కరఘాట్ వద్ద ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నీ రకాల ఏర్పాట్లు చేశామని, గోదావరి పుణ్యస్నానాలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు. నీటి విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.