వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:14 AM
వేవవిలో సింగరేణి ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు గోదావరి మాత్రమే మార్గంగా ఉండడం, గోదావరినది ఎండిపోయిన పరిస్థితుల్లో గనుల నీటిని వాడుకోవాలని యాజమాన్యం భావించింది.

గోదావరిఖని, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వేవవిలో సింగరేణి ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు గోదావరి మాత్రమే మార్గంగా ఉండడం, గోదావరినది ఎండిపోయిన పరిస్థితుల్లో గనుల నీటిని వాడుకోవాలని యాజమాన్యం భావించింది. మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఒత్తిడితో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరిలో ఉన్న ప్రవాహాన్ని నదిలోని సింగరేణి సంస్థకు చెందిన ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీ వైపు మళ్లించే పనులను గురువారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రారంభించారు.
ప్రొక్లైనర్ స్వయంగా నడుపుతూ నదిలో గ్యాలరీ వైపు కందకాలు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలనీలకు ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకోకుండా గత పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడంతో నదిలో నీరు లేని పరిస్థితి ఉందని, ఉన్న నీటిని ఒడిసి పట్టుకోవడమే మార్గంగా ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్టు రాజ్‌ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కుమార్, ఎస్‌ఈ వర ప్రసాద్, నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.