MLA Kaushik Reddy: దమ్ముంటే రాజీనామా చెయ్.. చూసుకుందాం: కౌశిక్ రెడ్డి సవాల్..
ABN , Publish Date - Jan 12 , 2025 | 06:31 PM
తెలంగాణ: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్‌లో ఇవాళ (ఆదివారం) జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్‌లో ఇవాళ (ఆదివారం) జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇది కాస్త ఇద్దరూ కొట్టుకునే స్థాయికి చేరింది. సమావేశంలో ఎమ్మెల్యేలు దాడి చేసుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెళ్లారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.."జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌ను నువ్వు ఏ పార్టీ అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు. అలా అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి చూపించాలి. సంజయ్‌కు ఇదే నా సవాల్. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు. అలాంటిది ఆయనపైనే విమర్శలు చేస్తున్నావు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇది మేము చూస్తూ ఉండాలా?. కచ్చితంగా నిలదీస్తాం. అడుగడుగునా అడ్డుకుంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.15వేల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందే. ఎన్నికల హామీలో చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యాలు చేసి భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకూ వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు అమలు చేసే వరకూ నిలదీస్తూనే ఉంటాం. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే అది మీ వల్ల కాదు. అధికారులను కూడా హెచ్చరిస్తున్నా. కొంతమంది ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాక తప్పదు. నేడు అతి చేస్తున్న అధికారులను ఎవ్వరినీ వదిలిపెట్టమని" హెచ్చరించారు.