Share News

వేతన వెతలు..

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:52 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సిబ్బంది చాలీచాలనీ వేతనాలు, అధిక పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ పేద కూలీలకు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి కల్పన, సుస్థిర ఆస్థుల కల్పన, గ్రామీణ పేదల జీవనోపాధి వనరులను శక్తివంతం చేసే కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.

వేతన వెతలు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సిబ్బంది చాలీచాలనీ వేతనాలు, అధిక పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ పేద కూలీలకు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి కల్పన, సుస్థిర ఆస్థుల కల్పన, గ్రామీణ పేదల జీవనోపాధి వనరులను శక్తివంతం చేసే కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు 3 నుంచి నాలుగు నెలల వేతనాలు అందక తీవ్ర ఇబ్బందుల మధ్య బతుకు బండి లాగుతున్నారు. ఉపాధిహామీ పనుల ప్రదేశాల వద్ద పారదర్శకంగా నిరంతరం పర్యవేక్షణ చేసే ఫీల్డ్‌అసిస్టెంట్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నాలుగు నెలలుగా వేతనాలు అందక అప్పులు చేస్తూ కుటుంబాల పోషణను సాగిస్తున్నారు.

18 ఏండ్లుగా భారంగానే...

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారిస్తూ ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనులను పర్యవేక్షిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది దాదాపు 18 ఏండ్లుగా పనిచేస్తున్నా ఏలాంటి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేక.. సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో 248 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఫీల్డ్‌ అసిస్టెంట్లు 153 మంది ఉన్నారు. వేతనాల కోసం ఎదురుచూస్తున్న వారిలో డీఆర్‌డీవో ఆఫీస్‌లో 19మంది, బోయినపల్లిలో 21మంది, చందుర్తిలో 21మంది, ఇల్లంతకుంట 31మంది, గంభీరావుపేటలో 19మంది, కోనరావుపేట 27మంది, ముస్తాబాద్‌లో 21మంది, రుద్రంగిలో ఆరుగురు, తంగళ్లపల్లిలో 29మంది, వీర్నపల్లిలో 10మంది, వేములవాడలో ఐదుగురు, వేములవాడ రూరల్‌లో 17మంది, ఎల్లారెడ్డిపేటలో 22మంది పనిచేస్తున్నారు. నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఫీల్డ్‌అసిస్టెంట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో కూలీలను మానిటరింగ్‌ చేస్తూ వారికి కేటాయించిన పనులను చేయిస్తున్నారు. దాదాపు 24 పనులు పర్యవేక్షిస్తారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఏ కేటగిరీ కింద రూ.13 వేలు, బీ కేటగిరీ కింద రూ 9500, సీ కేటగిరీ కింద రూ.8వేలు చెల్లిస్తున్నారు. పని విధానాలను బట్టి ఫీల్డ్‌అసిస్టెంట్లను విభజించి వేతనాలు ఇస్తున్నారు. ఈ జీవో 4779ను రద్దు చేసి గౌరవ వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోగా సకాలంలో వేతనాలు అందించడం లేదు. ఇటీవల ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాలు అందించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కనీస వేతనంగా రూ 35 వేలు, పేస్కేల్‌ వర్తింపజేయాలని వినతిపత్రాలు అందించారు. గత ప్రభుత్వంలో పనిచేసి కోల్పోయిన 31 నెలల జీతాలను ఇవ్వాలని కోరారు.

జిల్లాలో 1,99,660 మంది ఉపాధి కూలీలు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98,123 జాబ్‌ కార్డులు జారీ చేయగా, వీటిపరిధిలో 1,99,660 మంది కూలీలు ఉన్నారు. మహిళలు 1,01,252 మంది ఉన్నారు. ఎస్సీలు 52,744, ఎస్టీలు 15,399, ఇతరులు 1,31,517 మంది ఉన్నారు. జిల్లాలో ఉపాధి పొందుతున్న వారిలో 64,649 జాబ్‌ కార్డుల్లో 91,590 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 55,594 మంది ఉన్నారు. ఎస్సీలు 23,476 మంది, ఎస్టీలు 9,445 మంది, ఉపాధి పొందుతున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరం 7 రూపాయలను పెంచింది. ప్రస్తుతం రూ 300 ఉన్న కూలీ రూ 307కు పెరగడంతో సమ్మర్‌ అలవెన్స్‌లు మూడేండ్లుగా దూరమైన క్రమంలో కూలీ పెరుగుదల ఉపశమనం కలిగించింది. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కూలీలకు పనిదినాలు కల్పించడానికి రూ.80.26 కోట్ల అంచనా బడ్జెట్‌తో 26.75 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోని పనులను చేపట్టారు. మండల స్థాయిలో వ్యవసాయ సంబంధింత పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. లేబర్‌ బడ్జెట్‌ పనిదినాల్లో బోయినపల్లి మండలంలో 1,40,710 పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా చందుర్తిలో 2,44,424, ఇల్లంతకుంటలో 2,63,735, గంభీరావుపేటలో 3,66,733, కోనరావుపేటలో 3,02,552, ముస్తాబాద్‌లో 2,51,286, రుద్రంగిలో 69,347, తంగళ్లపల్లిలో 3,34,000, వీర్నపల్లిలో 2,35,000, వేములవాడలో 45,200, వేములవాడ రూరల్‌లో 1,46,730, ఎల్లారెడ్డిపేటలో 2,75,666 పనిదినాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిదినాలను 2025 సంవత్సరంలో ఏప్రిల్‌ మాసంలో 4,36,477 పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. మే నెల వరకు 8,65,202 పనిదినాలు, జూన్‌వరకు 11,19,603 పనిదినాలు, జూలై వరకు 12,31,258 పనిదినాలు, ఆగస్టు వరకు 13,37,300 పనిదినాలు, సెప్టెంబరు వరకు 14,43,862 పనిదినాలు, అక్టోబరు వరకు 15,58,084 పనిదినాలు, నవంబరు వరకు 16,92,632 పనిదినాలు, డిసెంబరు వరకు 18,42,542 పనిదినాలు, 2026 సంవత్సరంలో జనవరి వరకు 20,25,122 పనిదినాలు, ఫిబ్రవరి వరకు 23,08,391 పనిదినాలు, మార్చి వరకు పూర్తిగా 26,75,383 పనిదినాలు పూర్తిచేసే దిశగా సిబ్బంది పనిచేస్తున్నారు.

వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం..

- మంద రాజు, ఫీల్డ్‌అసిస్టెంట్‌ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న మాకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ఫీల్డ్‌అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారందరు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంటిలోకి నిత్యావసర వస్తువులు కూడా తేలేని పరిస్థితి ఏర్పడింది. వేతనాలు వెంటనే విడుదల చేయాలని, చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఉద్యోగ భద్రత కల్పించాలి.

Updated Date - Apr 19 , 2025 | 11:52 PM