KCR: కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:23 AM
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని.. ఈ సర్కార్‌పై ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
6 నెలల్లోనే ఈ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత
రేవంత్ అసమర్థతను అంతా గుర్తిస్తున్నారు
వందశాతం మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి
10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తథ్యం
కాంగ్రెస్ తొత్తులుగా కమ్యూనిస్టులు: కేసీఆర్
బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి భేటీలో వ్యాఖ్యలు
పార్టీ పనైపోయిందంటూ బీఆర్‌ఎస్ నేతలే
ప్రచారం చేశారని గులాబీ బాస్ ఆగ్రహం
ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ, 27న
బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడి
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందని.. ఈ సర్కార్‌పై ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవదని.. తమది తెలంగాణ అస్తిత్వ పార్టీ అని, వందశాతం మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ఆయన జోస్యం చెప్పారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యనేతలు హరీశ్‌రావు, కల్వకుంట్ల కవిత, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు, ఇతరనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన కేసీఆర్.. ప్రస్తుత సీఎంపై ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం ఏటా పెరిగిందన్న ఆయన.. అదే అధికారులున్నా కూడా కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం బాధాకరమన్నారు. అధికారులతో పనిచేయించుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని.. రాష్ట్ర ఆదాయం పడిపోవడంలో రేవంత్ అసమర్థతను అంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలకోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్లీ అదే స్థితికి తీసుకు వెళ్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రాన్ని మరోసారి దోపిడీ, వలసదారుల బారిన పడకుండా కాపాడుకోవాలని.. ఈ 25ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నేతలు కాంగ్రె్‌సకు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ ఓటమి.. తర్వాత ప్రజల మద్దతుతో మళ్లీ ఆ పార్టీ అధికారం చేపట్టడం వంటి అంశాలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ ప్రస్థానం, కష్టనష్టాలు, ప్రజల మద్దతు పొందేందుకు పార్టీ కార్యకర్తలను ఎన్టీఆర్ ప్రోత్సహించిన తీరును బీఆర్‌ఎస్ శ్రేణులకు వివరించారు.
సొంత నేతలే..
ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందగానే పార్టీ పనైపోయిందని బీఆర్‌ఎస్ నేతలే ప్రచారం చేశారని.. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్.. ఒక్కసారి ఓటమితో పడిపోయే పార్టీ కాదని, ప్రజల్లోకి వెళ్లి తిరిగి నిలబడగలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికీ మించి పోయిందేమీలేదని.. స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమని.. ఈ అంశంపై తానే న్యాయవాదులతో మాట్లాడానని.. త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. బీఆర్‌ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 10న పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపిన ఆయన.. అదే నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన కేసీఆర్.. ఆ కమిటీల ఎంపికకు ఇన్‌చార్జిగా హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. అలాగే బీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల పటిష్ఠతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్ని రకాల కమిటీలతోపాటు మహిళా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160వరకు పెరిగే అవకాశం ఉందని.. అలా పెరిగితే మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఒర్లకండిరా బాబూ.. దండం పెడుతా!
దాదాపు ఏడునెలల తర్వాత కేసీఆర్ తెలంగాణభవన్‌కు రావడంతో అక్కడంతా కోలాహల వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన్ను చుట్టుముట్టి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘‘ఒర్లకండిరా బాబూ.. మీకు దండం పెడతా’’ అని వ్యాఖ్యానించారు.
పాస్‌పోర్టు ఆఫీసుకు కేసీఆర్
రెజిమెంటల్‌బజార్: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భార్య శోభతో కలసి పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం బుధవారం సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. కేసీఆర్ దంపతులను ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ వారి వాహనం వద్దకు వెళ్లి ఆహ్వానించారు. అరగంటపాటు పాస్‌పోర్టు రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేసుకుని కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు.
ఎవర్నీ వదిలిపెట్టం
సిరిసిల్లలో టీ స్టాల్ వ్యాపారి పట్ల కలెక్టర్ అనుచిత వైఖరి ప్రదర్శించారని కేటీఆర్ ఎక్స్‌లో మండిపడ్డారు. టీ స్టాల్ వ్యాపారి వద్ద ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో అనుచితంగా వ్యవహరించిన కలెక్టర్‌కు వార్నింగ్ ఇస్తూ.. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇక మరో ట్వీట్‌లో.. సింగపూర్ పార్లమెంట్‌లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14 వేల డాలర్ల జరిమానా వేశారని, మరీ కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతురుణమాఫీ, రైతుబంధు, రూ.4000ల పింఛన్, మహిళలకు రూ.2500ల పింఛన్ అని ఇట్లా 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి రూ.4.20 లక్షల కోట్ల జరిమానా వేసినా తప్పులేదని వ్యంగంగా వ్యాఖ్యానించారు.
ఏడాదంతా బీఆర్‌ఎస్ రజతోత్సవాలు నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తిచేసుకోవడం తెలంగాణ సామాజిక చరిత్రలోనే ఒక ఉజ్వల ఘట్టమని, ఈ నేపథ్యంలో ఏడాదంతా పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. విస్తృతస్థాయి సమావేశం తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏడాదంతా పార్టీ రజతోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూనే ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడకుంటే బీఆర్‌ఎస్ తరఫున తమ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపా రు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ ఎంత అవసరమో.. ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావడం ఎంత ఆవశ్యకతనో.. పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలే సాక్ష్యమన్నారు. పార్టీ రజతోత్సవాల కోసం ఉద్యమకారులు, పార్టీ ముఖ్యులతో వారం రోజుల్లో కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభం తలెత్తిందని, తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు వృథా కావద్దంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్ట డం అవసరమన్నారు. ఎనిమిది మంది చొప్పున బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలున్నా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నయాపైసా రాలేదని, బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం ఢిల్లీలో ఉంటే గతంలోలాగా కేంద్రం మెడలు వంచేందుకు పోరాడేదన్నారు.
Also Read:
వరద సాయం ప్రకటించిన కేంద్రం.. ఏపీకే ఎక్కువ
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఐరాసలో భారత్ నిప్పులు
యుద్ధాన్ని మొదలుపెట్టిందే మీరు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..
For More Telangana News and Telugu News..