KTR: సీఎంగానే అసెంబ్లీకి కేసీఆర్
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:58 AM
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్ధమవుతున్నాయని తెలిపారు.
ఆ దిశగా బీఆర్‌ఎస్ శ్రేణులు పని చేస్తున్నాయి.. రేవంత్‌రెడ్డి దూషణలు వినేందుకు రావాలా?
వరంగల్‌లో కేసీఆర్ ఏం చెప్తారోనని అందరిలో ఆసక్తి
చరిత్రలో నిలిచింది టీడీపీ,బీఆర్‌ఎ్‌సలే
రేవంత్ రెండు జాతీయ పార్టీల సీఎం
రాష్ట్రంలో ఆ పార్టీలకు భవిష్యత్తు లేదు
స్మితా సబర్వాల్ రీట్వీట్ చేస్తే కేసా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులున్న సభకు 47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎందుకు రావాలని ప్రశ్నించారు. కేసీఆర్ వయసును, స్థాయిని చూడకుండా దుర్భాషలాడే ముఖ్యమంత్రి ఉన్నపుడు.. ఆ దూషణలు వినడానికి అసెంబ్లీకి రావాలా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమనే తట్టుకోలేకపోతున్నారని, ఇక కేసీఆర్ వస్తే వారంతా అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు సమాధానం చెప్పేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం ఉన్నామన్నారు. ఈ నెల 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్ కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో నష్టం జరుగుతున్నపుడు నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్ గర్జిస్తే.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడు, ఏం మాట్లాడాలో తెలుసునన్నారు. ఆయన ప్రజల్లో లేరంటూ విమర్శలు చేయడం తగదని, గెలిపించిన ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉన్నారని, రోజూ ఆయన వద్దకు వందల మంది వచ్చి వెళ్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఏం చెబుతారా అని..
కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ ఏం చేయబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొందని కేటీఆర్ అన్నారు. వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఏం చెబుతారా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సభా వేదిక తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పిస్తామన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా అప్రతిహతంగా ప్రతిభ చాటిన సందర్భంలేదని, అది కేవలం ఎన్‌టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి, కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్‌ఎ్‌సకు మాత్రమే సాధ్యమైందని అన్నారు. మరో 50ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అండగా గులాబీ పార్టీ ఉంటుందన్నారు. వచ్చే రెండు, మూడు దశాబ్దాలపాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని, కేంద్రంలో, రాష్ట్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని పార్టీ రజతోత్సవ సభ స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా.. కాంగ్రెస్ తరఫున గెలిచిన రేవంత్‌రెడ్డి.. రెండు జాతీయ పార్టీలకు అనుకూల సీఎంగా పనిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఓవైపు మోదీని, మరోవైపు రాహుల్‌ను సంతోషపెడుతూ కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాం గ్రెస్‌లో చాలామంది సీఎం కావాలనుకుంటున్నారని, అయితే రేవంత్ పూర్తికాలం ఉండాలని తాము ఆశిస్తున్నామన్నారు. ఆయన అనాలోచిత చర్యలు, అరాచకాలు పెరిగి.. వచ్చే 20ఏళ్లు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయని పరిస్థితి వస్తుందన్నారు.
మాపై కక్షసాధింపు చర్యలు..
ముఖ్యమంత్రి పాలనను గాలికొదిలేసి.. తమపై కేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. సైబర్ క్రైమ్ విభాగం వారు సోషల్ మీడియా పోస్టులపై అతిగా స్పందిస్తున్నారని, బీఆర్‌ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రేవంత్ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న పోలీసుల ఆటలు ఎక్కువకాలం సాగవన్నారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, లెక్కలు పక్కాగా తిరిగి అప్పజెబుతామని హెచ్చరించారు. ‘ఎక్స్’ వేదికగా వచ్చిన ఓ పోస్టును స్మితాసబర్వాల్ రీట్వీట్ చేసినందుకే ఆమెపై కేసు పెట్టడం కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనమన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చేతిలో ఓటమిపాలైన బీజేపీ నేతలు.. ఆ తర్వాత ఎంపీలుగా గెలవడం వారి గొప్పతనం కాదని, మోదీ హవానే కారణమన్నారు. ప్రజల గుండె ధైర్యం గులాబీజెండా అని, బీఆర్‌ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభమని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై తమకున్న ప్రేమలో అణువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదని, రాష్ట్రంలో ఈ రెండు జాతీయ పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు. టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేశామని, కానీ.. అనుకూలించలేదని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News