KTR: అరెస్టు చేస్తారా?
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:57 AM
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు.
నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ
జోక్యానికి సుప్రీం నిరాకరణతో పార్టీలో గుబులు
న్యాయవాదులతో వస్తానన్నట్లుగా కేటీఆర్ సమాచారం ఇవ్వలేదన్న ఈడీ
హైదరాబాద్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి, నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఈడీ ఏం అడగనుంది? విచారణ నేపథ్యంలో ఆయనను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపుతారా? లేదంటే.. అరెస్టు చేస్తారా? అన్నదానిపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ 9న ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి.. సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తిరస్కరించడం, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జోక్యానికి ధర్మాసనం నిరాకరించడంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కూడా కేటీఆర్ తరఫు న్యాయవాదులు వెనక్కి తీసుకోవడంతో.. అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా, ఏసీబీ మరోసారి కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో.. ఈడీ, ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకుంటాయన్న ఆందోళన నెలకొంది. ఈడీ విచారణ తర్వాత అరెస్టు చేస్తారా? ఫార్ములా-ఈ కేసు నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బయట పడతారా? లేదా? అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. హెచ్‌ఎండీఏ నిధులను కేటీఆర్ సొంతానికేమీ వాడుకోలేదని, ఫార్ములా-ఈ వ్యవహారంలో అవినీతే జరగలేదని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఈ కేసు నుంచి ఆయన బయటపడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. విచారణకు న్యాయవాదితో వస్తానంటూ కేటీఆర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి.
డిస్మిస్ చేయలేదు: బీఆర్‌ఎస్ లీగల్ సెల్
కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఆర్‌పై సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేయలేదని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇన్‌చార్జి సోమ భరత్‌కుమార్ తెలిపారు. న్యాయనిపుణుల సూచన మేరకు పిటిషన్‌ను కేటీఆర్ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై దుష్ప్రచారం తగదన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచేందుకే కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు నిర్వహించారని, కానీ.. ఆయనపై రాజకీయ కక్షతో బూటకపు కేసు పెట్టారని ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, అందుకే విచారణను కేటీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు.
కేసుపై ఈడీకి ఇప్పటికే అవగాహన!
ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గతనెలలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేశారు. కేటీఆర్ తదితరులపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ)తోపాటు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. హెచ్‌ఎండీఏ జనరల్ ఖాతా నుంచి విదేశీ కంపెనీ అయిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు రెండు విడతలుగా దాదాపు రూ.46 కోట్లను విదే శీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయి్‌సలు ఎఫ్‌ఈవో నుంచి అందిన తర్వాత అర్వింద్‌కుమార్, కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చానని బీఎల్‌ఎన్ రెడ్డి ఇప్పటికే ఈడీ విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఏదైనా విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో డబ్బు పంపించాలన్నప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ, ఇలాంటి అనుమతులేవీ పొందకుండా, క్యాబినెట్ నుంచి, ఆర్థికశాఖ నుంచి అనుమతులు లేకుండా నిధుల బదిలీ జరిగిందనే విషయంలో ఎవరె వరి పాత్ర ఎంత అనే కోణంలో ఈడీ అధికారులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
కేటీఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు!
ఫార్ములా-ఈ కేసులో క్వాష్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఈడీ, ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కేటీఆర్ చేసిన అభ్యర్థనకు హైకోర్టు నిరాకరించడం, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పీబీ వర్లేతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ తన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13.1ఏ వర్తించదని, కేటీఆర్ ఒక్క రూపాయి అయినా తీసుకున్నారంటూ ఎవరూ ఆరోపించలేదని అన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న అంశాలు విధానపరమైన లోపాలకు సంబంధించినవని వారు చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయంగా కక్షసాధింపు కేసుగా అభివర్ణించారు. ఫార్ములా-ఈ రేసుల ద్వారా రాష్ట్ర గత ఏడాది రూ.700 కోట్లు ఆర్జించినట్లు తెలిపారు. ఈ రేసులను కొనసాగించేందుకే కేటీఆర్ ప్రయత్నించారని చెప్పారు. అయితే విచారణ జరుగుతున్న ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఈ అభిప్రాయంతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. అసలు అధికారులు అవినీతికి పాల్పడరంటే నమ్మే పరిస్థితి ఉందా? అని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు. కాగా, న్యాయపరమైన సలహాకు అనుగుణంగా తాము పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ఈ కేసులో ఏ కోర్టులోనైనా అప్పీలు చేసుకునే అవకాశం తమకు ఉందన్నారు.