Share News

Kite Accidents: తెగిన బతుకు దారం

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:59 AM

సరదాల సంక్రాంతి కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. పతంగులు, మాంజాలు యమపాశాలుగా మారి నలుగురిని పొట్టనబెట్టుకోగా.. పలువురు మెడ భాగాల్లో మాంజా కోసుకుని, తీవ్ర గాయాలపాలయ్యారు.

Kite Accidents: తెగిన బతుకు దారం

  • పతంగులు ఎగురవేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి మృతి

  • మాంజా తగిలి పలువురికి గాయాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): సరదాల సంక్రాంతి కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. పతంగులు, మాంజాలు యమపాశాలుగా మారి నలుగురిని పొట్టనబెట్టుకోగా.. పలువురు మెడ భాగాల్లో మాంజా కోసుకుని, తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన చింతల్‌వార్‌ మాధవరావు(60) ఏడాదిగా మెహిదీపట్నం మార్కండేయనగర్‌లో ఉంటున్నారు. తాము అద్దెకుంటున్న భవనం నాలుగో అంతస్తు పైన కొందరు యువకులు సంక్రాంతి సందర్భంగా గాలిపటాలను ఎగురవేస్తుండగా.. చూడడానికి వెళ్లారు. గాలిపటాలను చూస్తూ.. కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలైన మాధవరావును ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. జిల్లెలగూడ మిథిలానగర్‌కు చెందిన బీజేపీ నేత కె.మహేశ్‌యాదవ్‌(39) మంగళవారం సాయంత్రం ఇంటిపైన గాలిపటం ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తు కిందపడ్డారు.


తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన జూపల్లి నరేందర్‌(48) మంగళవారం తన సోదరుడి డాబాపై పతంగి ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గుల్జార్‌ మార్కెట్‌కు చెందిన హుజైఫ్‌(10) అనే బాలుడు బుధవారం భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదశాత్తు కింద పడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. లంగర్‌హౌస్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌ ఏర్పుల బాలరాజు మంగళవారం బైక్‌పై నారాయణగూడ ఫ్లైఓవర్‌ పైనుంచి వెళ్తుండగా.. మెడకు మాంజా తగిలి తీవ్రగాయాలపాలయ్యారు.


హైదరాబాద్‌ పాతనగరంలోని లలిత్‌బాగ్‌కు చెందిన ఎస్‌.రామచంద్రన్‌ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద గాలిపటాన్ని తీసుకునే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. 50ు కాలినగాయాలతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంటలో నారాయణ, ఆయన భార్య వీరమణి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మాంజా తగిలి గాయాలపాలయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలాని బాబాకాలనీకి చెందిన జావేద్‌ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా.. చైనా మాంజా తగిలి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. కత్తితో కోసినట్లు మెడ తెగడంతో.. 30 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో డబ్బా రఘు అనే బాలుడి మెడకు చైనా మాంజ చుట్టుకుని తీవ్ర గాయమైంది. ఇదే జిల్లాలో మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌లో గుజ్జేటి ప్రవీణ్‌, నవీపేటలోని సుభా్‌షనగర్‌ కాలనీకి చెందిన అద్నాన్‌, భద్రాద్రి జిల్లా చుంచుపల్లిలో ముగ్గురు, కొత్తగూడంలో ఒకరు, విద్యానగర్‌ కాలనీ వద్ద దంపతులు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా.. మాంజా తగిలి గాయాలపాలయ్యారు.

Updated Date - Jan 16 , 2025 | 03:59 AM