Cyber Fraud: సైబర్ మోసానికి యువకుడి బలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:49 AM
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితు డి కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గృహ రుణం పేరిట 52 వేలు కాజేసిన సైబర్ మాయగాళ్లు
మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య
లింగంపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితు డి కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్‌కు చెందిన కమ్మరి గంగరాజు(28)కు జనవరి 2న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. బెంగళూరుకు చెందిన సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నానని, రూ.10 లక్షలు గృహ రుణం క్షణాల్లో ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే, రుణ ముంజూరుకు డిపాజిట్‌గా కొంత సొమ్ము చెల్లించాలని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన గంగరాజు ఆ వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాలో అదే రోజున విడతలవారీగా రూ.52,500 జమ చేశాడు.
తనకిస్తానన్న రుణం ఎంతసేపటికీ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో గంగరాజు తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేసి అడగ్గా.. ‘నాకే సంబంధం లేదు’ అనే బదులు వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన గంగరాజు తనకు జరిగిన మోసాన్ని వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు తెలియజేసి జనవరి 3న అర్ధరాత్రి తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం దాకా వేచి చూసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఐలాపూర్ ఊర చెరువు తూము వద్ద గంగరాజు చెప్పులు కనిపించాయని కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువులో గాలింపు చేపట్టగా గంగరాజు మృతదేహం లభ్యమైంది.