Family Dispute: మంచు కుటుంబ వివాదంలో కొత్త మలుపు
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:25 AM
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసులు, పోలీసు విచారణలు, కోర్టులో వాయిదాల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించినా మరో వివాదం తెరమీదకు వచ్చింది.

ఇల్లు ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు మోహన్‌బాబు ఫిర్యాదు
మనోజ్‌కు నోటీసులు జారీ.. అదనపు కలెక్టర్ ఎదుట హాజరైన నటుడు
నేను తప్పు చేయలేదు.. మావి ఆస్తి గొడవలు కాదు.. విద్యార్థుల కోసం పోరాటం
న్యాయం దక్కేంతవరకు వెనకుతగ్గను: మంచు మనోజ్
రంగారెడ్డి అర్బన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేసులు, పోలీసు విచారణలు, కోర్టులో వాయిదాల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించినా మరో వివాదం తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని తన ఇంట్లో ఉంటున్న చిన్న కుమారుడు మనోజ్‌ను ఖాళీ చేయించాలని కొన్ని రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్‌ను మోహన్‌బాబు ఆశ్రయించారు. దీంతో తాజాగా మోహన్‌బాబు నివాసంలో ఉంటున్న మనోజ్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు. వాటికి వివరణ ఇచ్చేందుకు మనోజ్ శనివారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎదుట హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కేవలం నా అన్న.. నాన్నను మందుకునెట్టి వెనుకనుంచి ఆడుతున్న నాటకం ఇది’’ అని ఆరోపించారు.
నివాసం ఖాళీ చేయమని కలెక్టర్ ఇచ్చిన నోటీసులపై లిఖితపూర్వకంగా స్పందిస్తానని, దాన్ని మీడియాకు కూడా విడుదల చేస్తానని తెలిపారు. తమవి ఆస్తి గొడవలు కాదని, తమ విద్యాసంస్థలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినదుందుకు ఆస్తి గొడవలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై తాను మెసేజ్ రూపంలో తెలిపినా పట్టించుకోలేదన్నారు. కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుందాం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ రావడం లేదని పేర్కొన్నారు. జల్‌పల్లిలోని నివాసంలో తన కూతురు ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరిగాయన్నారు. ఈ పోరాటం అంతా విద్యార్థులు, తన కుటుంబం, బంధువుల కోసమని.. ఎన్ని కేసులు పెట్టినా ఆపేది లేదని, న్యాయం జరిగేవరకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.