Bhuvanagiri: భువనగిరిలో ఉద్రిక్తత.. ఒక్కసారిగా కాకరేపిన జిల్లా రాజకీయాలు..
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:54 PM
భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు.
యాదాద్రి: భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీసు ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే దాడి గురించి తెలుసుకున్న కారు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
సమాధానం చెప్పలేక దాడులా?
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.."ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారు. కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించింది. ఇది అత్యంత హేయమైన చర్య. ప్రజలతోపాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారింది. దాడులు, గుండాగిరి తమ మార్కు పాలనని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. మా పార్టీ కార్యకర్తలు, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలతోపాటు, వారి వెనక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని" అన్నారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు దాడి చేయడంపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. "భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడులు వంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. యథా రాజా తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం?. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీరు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా?. బీఆర్ఎస్ పార్టీపై గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అశాంతి, అలజడి రేపారు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన రీతిలో బుద్ధి చెబుతామని" హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sankranti : సంక్రాంతి వస్తోంది.. చైనా మాంజాలతో జాగ్రత్త..
Dil Raju: నా ఉద్దేశం అదికాదు.. తప్పుగా అనుకోవద్దు