Share News

Hyderabad: ఎన్టీఆర్‌ ఘాట్‌ ఇలానా?

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:43 AM

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Hyderabad: ఎన్టీఆర్‌ ఘాట్‌ ఇలానా?

  • నిర్వహణపై ఏపీ మంత్రి లోకేశ్‌ అసంతృప్తి

  • గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం

  • సొంత నిధులతో మరమ్మతులకు సిబ్బందికి ఆదేశాలు

  • వర్ధంతి సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడికి నివాళులు

  • తరలివచ్చిన కుటుంబసభ్యులు, అభిమానులు, నేతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణ లోపంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్‌ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఘాట్‌ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని చూసి లోకేశ్‌ అసహనం వ్యక్తం చేశారు. అవసరమైన అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్‌ మరమ్మతులు పూర్తి చేయాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. ‘ఎన్టీఆర్‌ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు.. సినిమాల్లో, రాజకీయాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన వ్యక్తి. తెలుగుజాతి చరిత్రలో ఆయన ఓ ప్రభంజనం’ అని వ్యాఖ్యానించారు.


ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించే విషయమై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని.. కచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ ఒక్క ఎమ్మె ల్యే లేకున్నా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి 1.60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ పునర్‌వైభవానికి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్‌ ఘాట్‌కు కుటుంబసభ్యులు, అభిమానులు, టీడీపీ నేతల రాక మొదలైంది. ఉదయం 5.30 గంటలకే సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌తో కలసి వచ్చి నివాళులర్పించి కాసేపు ఘాట్‌ వద్ద కూర్చున్నారు. తర్వాత సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోదరుడు రామకృష్ణ, ఇతర నేతలతో కలసి వచ్చి ఘాట్‌ వద్ద నివాళులర్పించారు.


ఎన్టీఆర్‌ పథకాలే వేరే పేర్లతో అమలు: బాలకృష్ణ

ప్రపంచంలోనే ఎన్టీఆర్‌ను మించిన నటనాచార్యులు ఎవరూ లేరని బాలకృష్ణ అన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన పథకాలు ఇప్పటికీ పేర్లు మార్చి కొనసాగిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కులాలకు, మతాలకు అతీతుడైన ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, తెలంగాణ టీడీపీ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ తదితరులున్నారు. ఇటు ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హెచ్‌ఎండీఏ తీరు పట్ల ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ బాధ్యతలు ఎన్టీఆర్‌ ట్రస్టుకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు..

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలను ఆయన అభిమాను లు, టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదానంతో పాటు రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకా చౌదరి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ చరిత్ర సృష్టించారని.. జాతీయ రాజకీయాల్లో కూటమి ఏర్పాటుకు ఆద్యుడని అన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 04:43 AM