Greenfield Highway: హైదరాబాద్-డిండి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే!
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:58 AM
హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)పై నుంచి తక్కుగూడ దగ్గర దిగిన తరువాత నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది.
85 కి.మీ, 4 లేన్లు..1,525 కోట్ల వ్యయం
ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా రెండు అలైన్‌మెంట్లు సిద్ధం చేసిన ఎన్‌హెచ్‌ఏఐ
త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)పై నుంచి తక్కుగూడ దగ్గర దిగిన తరువాత నుంచి డిండి వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఏపీకి వెళ్లడానికి ప్రయాణ సమయంతో పాటు, కొంత దూరం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం తక్కుగూడ నుంచి డిండి వరకు ఉన్న (జాతీయ రహదారి 765) 2 లేన్ల రహదారికి ప్రత్యామ్నాయంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మరో రెండు కొత్త అలైన్‌మెంట్లను సిద్ధం చేసింది. దాని ప్రకారం ఈ రహదారిని 85 కిలోమీటర్ల మేర 4లేన్లతో నిర్మించనున్నారు. అందుకు రూ.1,525కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
రహదారి నమూనాలు, భూ సేకరణ తదితర వివరాలతో 18పేజీల నివేదికను ఎన్‌హెచ్‌ఏఐ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. రెండు అలైన్‌మెంట్లలో ఒకదానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయగానే మిగిలిన పనులు మొదలు కానున్నాయి. తాజాగా రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం ఈ రోడ్డు హైదరాబాద్, తుక్కుగూడ దగ్గర ప్రారంభమై కందుకూరు, కడ్తాల్, మైసిగండి, విటాయిపల్లి, ఆమనగల్, వెల్దండ మీదుగా డిండి వరకు ఉంటుంది. హైదరాబాద్ నుంచి డిండి వరకు రోజుకు సగటున 10వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నట్లు సర్వే నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రోడ్డునే 4 లేన్లగా విస్తరించడం లేదా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం... దేనివల్ల లాభనష్టాలు ఏంటనే వివరాలను పొందుపర్చారు. డిండి తరువాత మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించతలపెట్టిన విషయాన్ని నివేదికలో పొందరుపర్చారు.
13 జంక్షన్లు..
హైదరాబాద్ నుంచి డిండి వరకు ప్రస్తుత రహదారినే 4 లేన్లుగా విస్తరించాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దాని ప్రకారం.. ఇరువైపులా ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ల మార్పునకు కనీసం రూ.220 కోట్లు, విద్యుత్ లైన్ల మార్పునకు రూ.62కోట్లు అవసరమని తెలిపారు. ‘‘కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలనుకుంటే పైపులైన్ల అడ్డంకి ఉండదు. విద్యుత్ లైన్ల మార్పునకు రూ.30కోట్ల వరకు ఖర్చవుతుంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ లైన్‌ను కూడా ఒక చోట మార్చాల్సి వస్తుంది. ప్రస్తుత రోడ్డును విస్తరించాలంటే రూ.1,552కోట్లు, అదే కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికైతే రూ.1,525కోట్లు ఖర్చవుతుంది. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు 365హెక్టార్లు అవసరమవుతుండగా.. ఇందులో 3.6 హెక్టార్ల అటవీ భూమి ఉంది. మార్గమధ్యలో 7అండర్‌పా్‌సలు, 13 జంక్షన్లు, ఒక మేజర్ బ్రిడ్జి, 8 మైనర్ బ్రిడ్జిలు, 90 చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత రోడ్డును విస్తరించడం కంటే కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించడమే మంచిదని పేర్కొన్నారు.