Luxury Hotel: సర్కారీ స్టార్ హోటల్!
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:40 AM
హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలో.. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో.. మరో అద్భుత కట్టడం రాబోతోంది.
582 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం
అందులోనే ఏ-గ్రేడ్ ట్రేడ్ సెంటర్
3 ఎకరాల్లో.. 15 అంతస్తులుగా
రాయదుర్గంలోని ఐకియా పక్కన..
పలు దేశాల కంపెనీల వ్యాపార,
వాణిజ్య లావాదేవీలకు కేంద్రంగా..
టైమ్‌స్క్వేర్, టీ-వర్స్క్ భవనాలతో అండర్‌గ్రౌండ్ అనుసంధానం
టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐసీ
ఫిబ్రవరి 13 వరకు బిడ్‌కు అవకాశం ఒప్పందం తర్వాత 3 ఏళ్లలో పూర్తి
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలో.. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో.. మరో అద్భుత కట్టడం రాబోతోంది. హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా మార్చడంతోపాటు పరిశ్రమలను తీసుకురావడం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏ-గ్రేడ్ వాణిజ్య కేంద్రం (ట్రేడ్ సెంటర్)తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది. ఇప్పటికే టీ-వర్క్స్, టైమ్-స్క్వేర్‌ను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం వాటికి అనుసంధానంగా అధునాతన వసతులతో, అత్యంత విశాలమైన హోటల్‌తోపాటు అందులోనే వాణిజ్య కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. కార్యాలయాల అవసరాలు తీర్చడం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది. హైటెక్ సిటీకి దగ్గర్లో రాయదుర్గం మెట్రో స్టేషన్ తరువాత ఉన్న ఐకియా షోరూం పక్కన దీనిని నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలో హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో మూడు ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం జరపనుంది. మొత్తం 15 అంత స్తుల్లో 8.86 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అందుబాటులోకి తీసురానుంది. ఇందుకు రూ.582 కోట్ల నిధులను వెచ్చించనుంది. ప్రపంచంలోనే టాప్-10లో ఒకటిగా ఉండేలా ఈ హోటల్‌ను అత్యంత లగ్జరీగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు హోటల్‌తోపాటు వాణిజ్య కేంద్రం నిర్మాణానికి అర్హులైన బిడ్డర్ల నుంచి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్, వాణిజ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది.
పెట్టుబడులే లక్ష్యంగా..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉంది. వాతావరణంతోపాటు వివిధ సౌలభ్యాలు, సౌకర్యాలు, ప్రభుత్వ సహకారం మెండుగా ఉండడంతో ప్రపంచ స్థాయిలో పలు కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గతేడాది స్విట్జర్లాండ్‌లో జరిగిన దావోస్ సదస్సులోనూ వివిధ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి కంపెనీలు వస్తున్న నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య లావాదేవీలకు కేంద్రంగా అక్కడే ఒక లగ్జరీ హోటల్‌ను కూడా నిర్మిస్తే వ్యాపారులకు, కంపెనీలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్న భావనతోనే ప్రభుత్వం ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2021-22లో తెలంగాణ జీఎ్‌సడీపీ 11.5 లక్షల కోట్లు ఉంటే.. అందులో హైదరాబాద్ గణనీయంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణకు హైదరాబాద్ ఆర్థికంగా ఊతమిస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ర్టానిక్స్ వంటి రంగాల్లో దాదాపు 500 ప్రఖ్యాత కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారింది. దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌లో ఆఫీసులు ఉన్నాయి. దీంతో 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సులు క్రమంగా పెరుగుతున్నాయి.
గ్లోబల్ సదస్సులకు వేదికగా..
వరల్డ్ మెట్రోపాలిటన్ కాంగ్రెస్, బయో ఏసియా సమ్మిట్, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, ఇండియా జాయ్ గ్లోబల్ యూత్ ఫెస్టివల్, వరల్డ్ జియో స్పేసియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ వంటి అంతర్జాతీయు సదస్సులతో హైదరాబాద్ నగరం ప్రయాణ, పర్యాటక, వ్యాపారానికి గమ్యస్థానంగా మారింది. ఏటా కనీసం 30కి పైగా గ్లోబల్ సదస్సులకు హైదరాబాద్ వేదికగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ) అనేక పెద్ద పెద్ద సదస్సులకు ఆతిథ్యం ఇచ్చింది. ఏడాదికి సగటున వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4 లక్షల మంది ప్రతినిధులు వస్తున్నట్టు వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో హైదరాబాద్ 159వ స్థానంలో ఉంది. ఇక దేశంలోని ఉత్తమ నగరాల్లో ఢిల్లీ తరువాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి వచ్చేవారికి ప్రపంచంలోనే ఒక మంచి అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ లగ్జరీ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ఫైవ్ స్టార్ హోటల్, వాణిజ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిర్మించతలపెట్టిన టైమ్‌స్క్వేర్, టీ-వర్స్క్ భవనాలకు అండర్‌గ్రౌండ్, అండర్‌పా్‌సలతో అనుసంధానించనుంది.
హైదరాబాద్‌లోని ప్రస్తుత హోటళ్లు ఇలా..
హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త కంపెనీలు, పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో సౌకర్యాలను అందించగలిగే హోటళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో రిజిస్టర్డ్ హోటళ్లు 33 ఉండగా.. వాటిలో 5వేల గదులు ఉన్నాయి. రిజిస్టర్ కాని హోటళ్లు దాదాపు 2,300 వరకు ఉండగా.. వాటి పరిధిలో 21 వేల గదులున్నాయి. వీటిలో 5-స్టార్ డీలక్స్ స్థాయిలో 6 హోటళ్లు ఉండగా, వీటిలో 1,647 గదులు ఉన్నాయి. 5-స్టార్ హోటల్స్ 8 ఉండగా వీటిలో 1,412 గదులు, 4-స్టార్ హోటళ్లు 4 ఉండగా 547 గదులు, 3-స్టార్ హోటళ్లు 5 ఉండగా.. వీటిలో 321 గదులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరులో 14 వేల గదులు, ముంబైలో 27.5 శాతం, అహ్మదాబాద్‌లో 21 శాతం గదులు ఉన్నాయి. వీటితో పోలిస్తే ప్రస్తుతం హైదరాబాద్‌లో హోటల్ గదులు చాలా తక్కువగానే ఉన్నట్టు పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని టీజీఐఐసీ పేర్కొంది.
కొత్త హోటల్ నిర్మాణం ఇలా..
(ప్రతిపాదిత నమూనా ప్రకారం)
ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఫైవ్‌స్టార్ హోటల్ కమ్ ట్రేడ్ సెంటర్.. మూడెకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో ఉండనుంది. (60మీటర్ల ఎత్తు)
2,19,745చదరపు అడుగుల పార్కింగ్‌తో కలిపి మొత్తం 8,85,638 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉంటాయి.
హోటల్ కోసం 3.63 లక్షల చదరపు అడుగులు,
ట్రేడ్ సెంటర్ కోసం 2.42 లక్షల చదరపు అడుగులు
కేటాయిస్తారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆఫీసులు, హోటల్ లాబీ, బాంక్వెట్ హాళ్లను 60,536 చదరపు అడుగుల్లో ఉంటుంది. (ఒక్కో బాంక్వెట్ హాల్‌లో 600 మంది కూర్చునేలా నిర్మాణం)
1 నుంచి 4 అంతస్తుల్లో 2,42,143 చదరపు అడుగుల్లో ట్రేడ్ సెంటర్
5వ అంతస్తులో 3,63,215 చదరపు అడుగుల్లో లగ్జరీ హోటల్, రెస్టారెంట్లు ఉంటాయి.
6వ ఫ్లోర్ సర్వీస్ కోసం ఉంటుంది.
7 నుంచి 14 అంతస్తుల్లో లగ్జరీ హోటల్ 2,42,143 చదరపు అడుగుల్లో ఉంటుంది.