Share News

Nizamabad: నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:21 AM

నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ను సోమవారం విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు.

Nizamabad: నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై వేటు

  • విధుల పట్ల నిర్లక్ష్యంతో బాధ్యతల నుంచి తొలగింపు

  • ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్‌ నియామకం

సుభా్‌షనగర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ను సోమవారం విధుల నుంచి తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన ‘స్ట్రెచర్‌ లేక.. సిబ్బంది రాక.. భార్యను భుజాలపై మోసుకెళ్లిన భర్త’ అనే కథనానికి స్పందించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ఆ మరునాడే నిబంధనలకు విరుద్ధంగా ఆమె జన్మదిన వేడుకలను చాంబర్‌లో నిర్వహించడం వివాదాస్పదమైంది.


గత నెలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ సూపరింటెండెంట్‌ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పర్యవేక్షణ, సేవలు సక్రమంగా లేవని సమావేశంలోనే నిలదీశారు. గత ఐదేళ్లుగా సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రతిమారాజ్‌ కొంతకాలంగా ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ శ్రీనివా్‌సను నియమిస్తూ.. వెంటనే బాధ్యతలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 04:21 AM