TG Crime News: తెలంగాణ వ్యాప్తంగా విషాద ఘటనలు.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే..
ABN , Publish Date - Feb 20 , 2025 | 12:00 PM
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ(గురువారం) పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వివిధ కారణాలతో ఆరడజను మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ప్రతిరోజూ రోడ్డుప్రమాదాలు సహా అనేక కారణాలతో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు నేరాలు సైతం పెరిగిపోయి అనేక మంది హత్యకు గురవుతున్నారు. ఏది ఏమైనా నిత్యం ఏదో ఒక ప్రమాదంలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈరోజు అలాంటి ఘటనలే పలు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
విద్యుత్ తీగలు తగిలి..
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం.. కుమారుడు, భార్యతో కలిసి గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం బోధన్ మండలం పెగడపల్లి శివారుకు వెళ్లారు. అయితే గత రాత్రి పొలంలో అడవి పందుల కోసం వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చారు. వీటిని గమనించని బాధితులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గంగారం, భార్య బాలమణి, కుమారుడు కిషన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు బోధన్ రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా ముగ్గురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరెంట్ తీగలు అమర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వాట్సాప్ వైద్యం వికటించి..
సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి రోగి చనిపోయాడు. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరరావు (48) శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. అయితే వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వాట్సాప్ వైద్యం అందించారు. డాక్టర్‌కు వీడియో కాల్ చేసి అతని సూచనల మేరకు రోగికి చికిత్స అందించారు. దీంతో బాధితుడు నాగేశ్వరరావు అస్వస్థతకు గురై మృతిచెందాడు. సీపీఆర్ చేయాలంటూ హైడ్రామా నడిపిన సిబ్బంది.. మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, వాట్సాప్ వైద్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
అనుమానంతో..
మరోవైపు సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సిద్దిపేట- నరసాపురం రోడ్డు మైసమ్మ గుడి వద్ద నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద బోదాసు శ్రీనివాస్ అనే వ్యక్తి విగత జీవిగా పడి ఉన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తురుక్వడ్‌గావ్ గ్రామంలో భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. గ్రామానికి చెందిన లక్ష్మీపై భర్త గుండప్ప గొడ్డలితో విరుచుకుపడి ప్రాణాలు తీశాడు. లక్ష్మీకి వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన గుండప్ప ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Students Missing: అదృశ్యమైన ఇంటర్మీడియట్ విద్యార్థినిలు.. సంచలనం సృష్టిస్తున్న ఘటన..
Delhi: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కేంద్ర మంత్రులతో వరస భేటీలు..