Share News

Padi Kaushik Reddy: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:45 AM

ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

Padi Kaushik Reddy: ‘మా శవయాత్రకు రండి’  వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

  • హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ‘మీరు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.. మీరు ఓటు వేసి లీడ్‌ ఇస్తే విజయయాత్రకు వస్తాను.. లేదంటే మా శవయాత్రకు మీరు రండి’ అంటూ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఇది ఓటర్లను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లుగా ఉందంటూ గత ఏడాది నవంబర్‌లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘నేను అమాయకుడిని. ఎలాంటి నేరం చేయలేదు. కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఈ కేసులో ఇరికించారు. కమలాపూర్‌ బస్టాండ్‌ ఏరియాలో నేను వ్యాఖ్యలు చేశానని ఆరోపించిన పోలీసులు 24 గంటలు ఆలస్యంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షులు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ఒక్క స్వతంత్ర సాక్షి కూడా లేరు. ఈ నేపథ్యంలో కేసు కొట్టేయండి’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.

Updated Date - Jan 04 , 2025 | 05:45 AM