Share News

Property Registration: ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రిజిస్ట్రేషన్ల గుట్టు!

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:36 AM

కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల గుట్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతోందా? అంటే.. అవననే అంటున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు.

Property Registration: ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రిజిస్ట్రేషన్ల గుట్టు!

  • వారి కనుసన్నల్లోనే డాక్యుమెంట్ల స్కానింగ్‌.. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో చక్రం తిప్పుతున్న వైనం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల గుట్టు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతోందా? అంటే.. అవననే అంటున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు. స్థిరాస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను స్కానింగ్‌ చేసేందుకు దాదాపు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులే అనధికారికంగా పని చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో నలుగురు లేదా ఐదుగురితో ఇలా పని చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (కార్డ్‌) అమల్లోకి వచ్చిన 1998నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను స్కానింగ్‌ చేస్తున్నారు. అయితే, డాక్యుమెంట్లను స్కానింగ్‌ చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేసిన ఉన్నతాధికారులు సిబ్బందిని మాత్రం నియమించలేదు. మరోవైపు.. ఔట్‌సోర్సింగ్‌ నియామకాలపైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో స్కానింగ్‌ ఆపరేటర్లను తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో డాక్యుమెంట్ల స్కానింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు బయటి (జిరాక్సు షాపుల యజమానుల) వ్యక్తులపైనే సబ్‌ రిజిస్ట్రార్లు ఆధారపడుతున్నారు.


ఇటీవలి కాలంలో హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లోనూ ఆస్తుల క్రయవిక్రయాలు పెరగడంతో గ్రేటర్‌ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. పటాన్‌చరు, గండిపేట, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, ఉప్పల్‌ వంటి ఎస్సార్వోలలో రోజుకు 100 నుంచి 250వరకు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. ఆ డాక్యుమెంట్లను స్కానింగ్‌ చేసేందుకు రెగ్యులర్‌ సిబ్బంది లేకపోవడంతో బయటి వ్యక్తులతో చేయించేందుకు వారం నుంచి 10రోజుల సమయం పడుతోంది. ఫలితంగా కొనుగోలుదారులు తమ ఆస్తిపత్రాల కోసం ఎస్సార్వోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని పత్రాలను స్కాన్‌ చేసి ఇచ్చేందుకు కూడా ప్రైవేటు వ్యక్తులు దందా సాగిస్తున్నారు. ఎలాంటి వేతనం లేకుండానే వీరు పని చేస్తున్నారంటే.. ఈ దందా ఏ రీతిన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు(ఎస్సార్వో)ల్లో సబ్‌ రిజిస్ట్రార్ల కన్నా బయటి వ్యక్తుల ఆజమాయిషీనే ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించి వెంటనే రెగ్యులర్‌ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 03:36 AM