Share News

Hyderabad: దారులన్నీ పల్లెలకే..

ABN , Publish Date - Jan 12 , 2025 | 04:54 AM

సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు.

Hyderabad: దారులన్నీ పల్లెలకే..

  • సంక్రాంతికి సొంతూళ్లకు పట్నం జనం.. వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు

  • బారులు తీరిన విజయవాడ రహదారి.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌

  • 32 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటలు

  • 250కి పైగా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలపై కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. పండుగ సంబురాలను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు పల్లె బాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు. బారులు తీరిన బస్సులు.. కిక్కిరిసిన ప్రయాణికులతో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ (ఎంజీబీఎస్‌), జూబ్లీ బస్‌స్టేషన్‌(జేబీఎ్‌స)లలో అడుగు తీస్తే అడుగుపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి టీజీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. పండుగ పేరిట ఆర్టీసీ బస్సుల్లో 50% చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆయా బస్‌స్టేషన్లకు చేరుకోవడానికి హైదరాబాద్‌ వాసులు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో.. వాటిల్లోనూ ప్రయాణికుల రద్దీ రోజువారీ కంటే రెట్టింపుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే దారుల్లో వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరడంతో అక్కడక్కడ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. శనివారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) కార్లతో కిక్కిరిసింది. నిమిషానికి సగటున 75-80 కార్లు వెళ్లాయి. జాతీయ రహదారిపై ఒక పాయింట్‌ వద్ద నిల్చొని పరిలించగా.. ఈ కార్ల ప్రవాహం లెక్క తేలింది. హైదరాబాద్‌-విజయవాడ రహదారిలో ఉన్న పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు, కీసర టోల్‌ ప్లాజాల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. ఒక్కొటోల్‌ ప్లాజాలో సగటున 16 గేట్లు ఉంటే.. వాటిలో 10కి పైగా విజయవాడ రహదారికి వెళ్లే వాహనాలను అనుమతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ మీదుగా రెండు రోజుల్లో లక్షా 50 వేల వాహనాలు వెళ్లినట్లు టోల్‌గేట్‌ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఒక్క శనివారం రోజే 90,000 వాహనాల్లో ఏపీవైపు ప్రజలు వెళ్లారు. బీబీనగర్‌ మండలం గూడూరు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు, మెదక్‌ జిల్లా తూఫ్రాన్‌ టోల్‌ప్లాజాల వద్దా భారీగా వాహనాల రద్దీ కనిపించింది.

21.jpg


32 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు

పెద్దఅంబర్‌పేట నుంచి చౌటుప్పల్‌ వరకు 32 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణానికి మూడు గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు వాపోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటంతో వాహనాలు నెమ్మదించాయి. ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను పర్యవేక్షించారు. చౌటుప్పల్‌, సూర్యాపేట పట్టణంలో ఎన్‌హెచ్‌-65పై ప్లైఓవర్లు నిర్మిస్తున్నందున ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. గత ఏడాదితో పోల్చితే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య 30ు పెరిగినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుం డా పకడ్బందీ ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌ పరిసరాల నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ 146 సీటీ బస్సులను నడుపుతోంది. ఇక పండుగ కోసం రెండు నెలల ముందుగానే రైళ్లలో వెళ్లడానికి రిజర్వేషన్‌ కోసం ప్రయత్నిస్తే దొరకకపోవడంతో ప్రయాణికులకు అవస్థ లు తప్పడం లేదు. మరోవైపు.. నిబంధనలు ఉల్లంఘి స్తూ తిరుగు తున్న 250కిపైగా ప్రైవేటు బస్సులు, ఇత ర వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్ర మోహన్‌ తెలిపారు.


ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకూ పెరుగుతుండడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ సూచనలు చేశారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు ఎన్‌హెచ్‌-65పై పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-11 నుంచి చౌటుప్పల్‌, చిట్యాల మీదుగా వెళ్తుంటాయి. రద్దీ నేపథ్యంలో విజయవాడవైపు వెళ్లే వాహనాలు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఘట్‌కేసర్‌ ఎగ్జిట్‌-9 నుంచి భువనగిరి, వలిగొండ, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు బొంగుళూరు ఎగ్జిట్‌-12 నుంచి ఇబ్రహీంపట్నం, మాల్‌, దేవరకొండ, నాగార్జున్‌సాగర్‌ మీదుగా గుంటూరు చేరుకోవాలంటూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

Updated Date - Jan 12 , 2025 | 04:54 AM