SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:20 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క, టన్నెల్ చిక్కుకున్న కార్మికుల కుటుంబసభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు.

ఝార్ఖండ్ నుంచి టన్నెల్ వద్దకు బాధిత కుటుంబాలు
తమ వారి కోసం ఎదురుచూపులు
మహబూబ్‌నగర్/దోమలపెంట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క, టన్నెల్ చిక్కుకున్న కార్మికుల కుటుంబసభ్యులు దోమలపెంట శిబిరానికి చేరుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని కాంబియా కుంబటోలి అనే గ్రామానికి చెందిన సంతోష్ సాహు, సందీప్ సాహు, జగ్టా ఎక్కేస్ అనూజ్ సాహు టన్నెల్‌లో చిక్కుకోగా.. వారి కుటుంబసభ్యులను ఝార్ఖండ్ ప్రభుత్వం దోమలపెంటకు తీసుకొచ్చింది. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరంతా తమ బాధను దిగమింగుకుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ తమ వారి కోసం ఎదురుచూస్తున్నారు. వారిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా తమ కష్టాన్ని వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు.
బావ రాకపోతే అక్కాపిల్లలకు తోడెవరు?
భార్యాబిడ్డలను పోషించుకునేందుకు మా బావ సంతోష్ సాహు ఇంత దూరం వచ్చాడు. సొరంగం పనులు చేసి కుటుంబాన్ని(భార్య, ముగ్గురు పిల్లలు) చూసుకుంటున్నాడు.. ఆయనకు ఏమైనా జరిగితే మా అక్క, ఆమె పిల్లలకు తోడునీడ లేకుండా పోతుంది.
- పవన్ సాహు, బాధితుడు సంతోష్ సాహు బావమరిది
జీతం ఇస్తే ఇంటికొస్తా
సందీప్ సాహా నా పెద్ద కొడుకు, మూడు నెలల జీతం ఇవ్వగానే ఇంటికొస్తా అని వారం క్రితమే మాతో ఫోన్‌లో చెప్పాడు. ఇంటి దగ్గరే ఉండి ఏదైనా పని చేసుకోమని చెబితే... కొంత డబ్బు సంపాదిస్తే మన కుటుంబం బాగుపడుతుందని చెప్పి మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇలా అయింది. ఎప్పుడు బయటకు వస్తాడో అని ఎదురుచూస్తున్నాను.
- జీతు సాహు, బాధితుడు సందీప్ సాహు తండ్రి
నేనే అమ్మని పోషిస్తానని చెప్పాడు
వచ్చిన పని చేసుకుంటూ సొంతూరిలో ఉండాలని మా తమ్ముడికి చాలాసార్లు చెప్పాం. కానీ, సొంతంగా డబ్బు సంపాదించి తండ్రి లేని ఇంటిని, తల్లిని పోషించుకుంటానని చెప్పేవాడు. మా పక్క ఊరి వాళ్లు చాలామంది ఇక్కడ పనిచేసుకుంటున్నారు. 2017లో ఇక్కడికి వచ్చిన జగ్టా ఎక్కేస్ ఎనిమిదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరి క్రితం చివరిగా ఇంటికొచ్చాడు. ఇంటికి వస్తే ఏదైనా చిన్నవ్యాపారం పెట్టిసా అని చెప్పినా వినలేదు. చివరకు సొరంగంలో చిక్కుకున్నాడని తెలిసి మా కుటుంబమంతా ఆందోళనలో ఉంది. తమ్ముడు క్షేమంగా రావాలని కోరుకుంటున్నా
- జాత్రం ఎక్కేస్, బాధితుడు జగ్టా ఎక్కేస్ అన్న
లోపల కొడుకు ఎట్లుండో
నా పెద్ద కొడుకు అనూజ్ సాహును ఎంతో గారాభంగా పెంచాం. కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటానని చెప్పి సొరంగం పనులు చేసేందుకు ఇక్కడికి వచ్చాడు. గ్రామంలో మాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకోవడంతోపాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాం. సొరంగంలో జరిగిన ప్రమాదం కోసం శనివారం సాయంత్రం మాకు తెలిసింది. లోపల మా అబ్బాయి ఎలా ఉన్నాడనేది కంపెనీ వారు చెప్పడం లేదు. బయటకు వస్తున్నారని మాత్రమే చెబుతున్నారు. ఏం అర్థం కావడం లేదు.
- రాంప్రతాప్ సాహు, బాధితుడు అనూజ్ సాహు తండ్రి