CM Revanth Reddy: రాజకీయ గళం కోల్పోతాం
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:44 AM
జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం.

ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులమైతాం
అడ్డుకోడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలి
మరో పాతికేళ్లు సీట్లు పెంచొద్దు
ఉన్న సీట్లతోనే పునర్విభజన.. రాష్ట్రమే యూనిట్
అక్కడి జనాభా ఆధారంగా సీట్ల హద్దులు
50% పెంచితే మాకు 33% సీట్లు ఇవ్వాల్సిందే
వాటిని దక్షిణాదికి ప్రొ రేటా ప్రకారం పంచవచ్చు
జనాభా ఆధారంగా పునర్విభజనకు వ్యతిరేకం
జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం. ఉత్తరాది మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి వేస్తుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని, దీనికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజనపై అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన స్టాలిన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ప్రధాని మోదీ మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి విధానాన్ని పాటించాలి. మరో 25ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎలాంటి మార్పు తీసుకురావద్దు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన చేపట్టాలి. సీట్లు పెంచవద్దు. ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలానే చేసింది. లేకపోతే, రాష్ట్రాల మధ్య రాజకీయ అసమతౌల్యాలు వచ్చేవి. 2001లో వాజ్‌పేయి సర్కారూ దానినే పాటించింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాగే చేయగలరా!?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా చేపట్టాలని, నగరాలు, గ్రామాల జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని సూచించారు. ‘ప్రొ రేటా’ విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుందని, రాజకీయ అంతరాలను పెంచుతుందని వివరించారు. ప్రొ రేటా విధానంలో సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుందని, ఒక్క సీటు కూడా కీలకంగా మారుతుందని, ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని గుర్తు చేశారు. అందుకే, ప్రొ రేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ నిర్మాణంలో 50 ఏళ్లపాటు అందించిన సేవలకు దక్షిణాదిని అభినందించాలని, మనకు కొంత వెనక్కి చెల్లించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశమివ్వాలని అన్నారు.
లోక్‌సభలో 33 శాతం సీట్లు ఇవ్వండి
‘‘లోక్‌సభలో ప్రస్తుతం 543 సీట్లున్నాయి. వీటిలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130 మాత్రమే. ఇది మొత్తం సీట్లలో 24 శాతమే. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాల డిమాండ్. పునర్విభజనతో 50 శాతం సీట్లను పెంచాలని బీజేపీ భావిస్తే.. 272 సీట్లు పెరుగుతాయి. అప్పుడు మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 815 అవుతుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం.. అంటే 272 సీట్లు ఇవ్వాలి. వీటిని దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చు. మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం తన అభిమతం మేరకు పంచవచ్చు’’ అని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్యను పెంచాలని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
ఎక్కువ నిధులిస్తూ.. తక్కువ పొందాలా?
‘‘దేశ ఖజానాకు మనం పెద్ద మొత్తంలో నిధులిస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాం. పన్నుల రూపంలో కేంద్రానికి తమిళనాడు రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తోంది. అదే.. యూపీకి రూపాయికి రూ.2.73; మధ్యప్రదేశ్‌కు రూ.1.73; బిహార్‌కు రూ.6.06 వెనక్కి వస్తున్నాయి. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి’’ అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్ను చెల్లింపులను క్రమంగా తగ్గిస్తోందని తప్పుబట్టారు. జనాభాను నియంత్రించాలని 1971లో కేంద్రం నిర్ణయించినప్పటి నుంచీ దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయని, ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. దక్షిణాదిని రాజకీయంగా కుదించే ఈ పునర్విభజనను అంగీకరించలేమని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
తదుపరి భేటీ హైదరాబాద్‌లో..
పునర్విభజన ప్రక్రియపై తమ రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, తమ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడం
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల హక్కుల విషయంలో రాజీ పడబోమని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్‌పై చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన సీఎం దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది. రాజ్య విస్తరణ కాంక్ష, రాజకీయ ప్రయోజన ఆకాంక్షతో డీలిమిటేషన్‌ను అస్త్రంగా ప్రయోగించి వీటిని విచ్ఛిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం’’ అని స్పష్టం చేశారు. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, న్యాయం జరిగే వరకు, ధర్మం గెలిచే వరకు హైదరాబాద్ ఆకారం ఇస్తుందని పేర్కొన్నారు.